ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • పర్మినెంట్ ప్రాతిపదికన నియామకాలు
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు
  • పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక
  • త్వరలో అధికారిక నోటిఫికేషన్

హైదరాబాద్, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టనుంది.

ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదని, అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్, రోస్టర్ నిబంధనల మేరకు ఎంపికలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీ ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అయితే అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ఎస్‌ఎస్‌సీ మార్కులు, జీపీఏ విధానంపై స్పష్టత అవసరమైంది. గతంలో జీపీఏ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల గ్రేడ్లను మార్కుల శాతంగా ఎలా మార్పిడి చేయాలన్న అంశంపై ఆర్టీసీ అధికారులు ఎస్‌ఎస్‌సీ బోర్డును మార్గదర్శకాలు కోరారు. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

You may also like...