భారత్‌–అమెరికా సంబంధాల బలోపేతానికి కీలక చర్చలు

రష్యా చమురు కొనుగోళ్ల తగ్గింపును స్వాగతించిన అమెరికా
భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో జరిగిన భేటీలో వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, రక్షణ, ఆధునిక సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉందని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, పరస్పర ప్రయోజనాల దృష్ట్యా సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించారు. ఇంధన వాణిజ్యాన్ని పెంచుకోవాలని, అమెరికా సాంకేతిక వ్యవస్థల కొనుగోళ్లను భారత్‌ మరింత విస్తరించాలని రూబియో కోరారు. అలాగే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించే దిశగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా స్వాగతిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంపై జైశంకర్‌, రూబియో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని చర్చించారు. వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధిస్తే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. విభేదాలను పక్కనపెట్టి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

You may also like...