మోకిల లో విద్యారంభ వేడుకలు
- మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత - July 9, 2026
- శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం - July 9, 2026
- రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన - July 9, 2026

శంకర్పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంప్రదాయబద్ధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి చదువును జీవితంలో అత్యంత విలువైన సంపదగా భావించి క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ఆధునిక మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధనతో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చెందాయని అన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం, సమగ్ర విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నారుల్లో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. లక్ష్మీకాంత్ రెడ్డి, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, అనురాధ, నాగరాణి, అరుణకుమారి, కవిత, గ్రామ కార్యదర్శి నర్సింలు, ఎండీ ఆజాం, ఎల్. శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ జి. శ్రీనివాస్, మన్నే వెంకటేష్, ఎల్. సంజయ్, ఎం. కృష్ణ, టి. రాము, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


