మహిళల ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కట్టడి..

మహిళల ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కట్టడి..
- జూన్ 2 నుంచి ‘మహాలక్ష్మీ’ కార్డుల అమలు
- ఆధార్ వ్యవస్థకు స్వస్తి.. స్మార్ట్ కార్డులతో ప్రయాణానికి కొత్త నిబంధనలు
- జిల్లాకో మండలంలో పైలట్ అమలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు సన్నాహాలు
- రూ.50 చెల్లించి కార్డు తప్పనిసరి.. మీసేవ, బస్పాస్ కేంద్రాల్లో అందుబాటు
- ఉచిత ప్రయాణాన్ని డిజిటల్ పర్యవేక్షణలోకి తీసుకొస్తున్న ప్రభుత్వం
- మహిళల సంక్షేమ పథకానికి సాంకేతిక ముసుగులో కట్టుదిట్టమైన అమలు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మీ’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి మహిళలకు ప్రత్యేక ‘మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు’ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఉచిత ప్రయాణ పథకాన్ని సక్రమంగా పర్యవేక్షించడంతో పాటు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
ఇప్పటివరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా చూపిస్తూ వస్తున్నారు. అయితే ఆధార్ ఆధారిత ధృవీకరణలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, డేటా సరళీకరణలో లోపాలు, వినియోగదారుల గుర్తింపులో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెస్తోంది.
ఇకపై ఉచిత ప్రయాణం పూర్తిస్థాయిలో డిజిటల్ నియంత్రణలోకి వెళ్లనుంది. ప్రతి మహిళా ప్రయాణికురాలి వివరాలు స్మార్ట్ కార్డులో నిక్షిప్తం చేయబడతాయి. దీని ద్వారా ప్రయాణ లావాదేవీలపై ఖచ్చితమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. పైలట్ అమలు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించనున్నారు.
మహిళలు ఈ కార్డులను మీసేవ కేంద్రాలు, ఆర్టీసీ బస్పాస్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి పొందవలసి ఉంటుంది. కార్డుల జారీ పూర్తయ్యే వరకు ఆధార్ కార్డు ఆధారంగానే ఉచిత ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిర్ణయం మహిళల ప్రయాణ సౌలభ్యానికి తోడ్పడటమే కాకుండా, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, క్రమబద్ధత తీసుకురావడంలో కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు చెబుతున్నారు.
మహాలక్ష్మీ పథకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ, సంక్షేమాన్ని డిజిటల్ వ్యవస్థలోకి మలుస్తున్న ప్రభుత్వ చర్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
