సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్ సీఎం పీఠానికి మార్గం సుగమం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు తన అధికారిక నివాసం ‘కావేరి’లో నిర్వహించిన అల్పాహార సమావేశంలో ఈ విషయాన్ని ఆయన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి . కే . శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలపడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న డీకే శివకుమార్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

క్యాబినెట్ సమావేశంలో సిద్ధరామయ్య భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివకుమార్‌ను తదుపరి సీఎంగా ఎంపిక చేయాలని సూచించిందని ఆయన మంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా “ఇంతకాలం నేను చేసిన పనుల పట్ల సంతృప్తిగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు గవర్నర్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో ఉన్నందున, సిద్ధరామయ్య మధ్యాహ్నం లోక్ భవన్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

ఈ పరిణామంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడికి తెరలేచినట్టయింది. మంత్రి హెచ్.కె. పాటిల్ కూడా డీకే శివకుమార్ సీఎం పీఠం అధిరోహించనున్నారని సంకేతాలు ఇచ్చారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

You may also like...

Translate »