బండి సంజయ్ మంత్రి పదవికి గండం…?

బండి సంజయ్ మంత్రి పదవికి గండం…?
– పోక్సో కేసులో బండి సంజయ్‌పై ఒత్తిడి
– నిందితుల అరెస్టు నుంచి బాధితురాలికి న్యాయం వరకు ప్రధాన డిమాండ్లు
– సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన లు
– బండి సంజయ్ రాజీనామా లేదా బర్తరఫ్ చేయాలని డిమాండ్
– బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి
– పోలీసుల వైఫల్యంపై చర్యలు తీసుకోవాలి
– కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై విచారణ జరపాలని పట్టు
జ్ఞానతెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో కేసు నమోదై 48 గంటలు గడిచినా ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం పట్ల మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసుల్లో వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
చట్టం ప్రకారం 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉండగా.. సాయి భగీరథ్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అతడు పరారీలో ఉన్నాడా? లేక అధికార అండతో దాచిపెడుతున్నారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఈ వ్యవహారంలో ఉన్న సహచరులను కూడా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సాయి భగీరథ్ దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ అతనిపై వెంటనే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు సమాచారం పంపాలని కోరుతున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ప్రకటించాలని కూడా సూచిస్తున్నారు.
ఇక ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత సాయి భగీరథ్ తన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కొత్త అనుమానాలకు దారితీసింది. చాట్‌లు, డిజిటల్ ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలకు పోలీసులు వెంటనే లేఖలు రాసి డేటాను భద్రపరచాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రమంత్రిగా ఆయన పదవిలో కొనసాగితే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, అందువల్ల వెంటనే రాజీనామా చేయాలని లేక ప్రధాని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించడం, కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్‌ను కూడా సహనిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
బాధితురాలు, ఆమె కుటుంబానికి వెంటనే భద్రత కల్పించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ రూపంలో తక్షణమే నమోదు చేయాలని సూచిస్తున్నాయి. గతంలో ఇలాంటి కేసుల్లో బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ ఇప్పుడు తన కుమారుడి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
పేట్‌బషీరాబాద్ పోలీసుల వైఖరిపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండేలా చేసి, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం చట్ట విరుద్ధమని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫిర్యాదు నమోదు ఆలస్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసులో ప్రస్తుతం నమోదు చేసిన సెక్షన్లు నిందితుడికి సులభంగా బెయిల్ వచ్చేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. కఠినమైన పోక్సో సెక్షన్లు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు కఠిన సెక్షన్లు పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక బాధితురాలి కులాన్ని ప్రస్తావిస్తూ సానుభూతి రాజకీయాలు చేయడం సరికాదని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. బాధితురాలు కూడా వెనుకబడిన వర్గానికి చెందిన బాలికేనని గుర్తుచేస్తూ.. కుల రాజకీయాలతో అసలు సమస్యను మసకబార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘మీ టూ’ ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్‌ను పదవి నుంచి తప్పించారని, మరి ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఉన్నావ్ ఘటనలో బీజేపీ నేత సెంగార్‌కు శిక్ష పడిన విషయాన్ని గుర్తుచేస్తూ.. బాధిత కుటుంబాలకు రక్షణ లేకపోతే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో దేశం చూసిందని పేర్కొంటున్నారు. ఈ కేసులో కూడా బాధితురాలు, ఆమె కుటుంబానికి ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం, అధికార యంత్రాంగానిదేనని హెచ్చరిస్తున్నారు.
ఈ కేసు కేవలం ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణ మాత్రమే కాదని.. అధికార అహంకారం, రాజకీయ ప్రభావం, చట్ట వ్యవస్థపై ఒత్తిళ్లకు ఇది ఉదాహరణగా మారిందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
