తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు

తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు
– జనగణన ముఖ్యమా..? విద్యార్థుల సమీకరణ ముఖ్యమా..?
– విద్యా వారోత్సవాల పేరుతో ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు
– వేసవి సెలవుల్లో విద్యా వారోత్సవాల వివాదం
– జనగణన విధుల్లో టీచర్లపై అదనపు భారం
– విద్యార్థుల సమీకరణలో ఉపాధ్యాయుల అవస్థలు
– ఎండల్లో పిల్లల తరలింపుపై తల్లిదండ్రుల ఆందోళన
– ప్రాధాన్యతలపై విద్యాశాఖకు పెరుగుతున్న ప్రశ్నలు
జ్ఞానతెలంగాణ,ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ :
రాష్ట్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు కొనసాగుతుండగా, మరోవైపు విద్యార్థులను భారీ సంఖ్యలో సమీకరించాలని అధికారుల ఆదేశాలు రావడం ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇదే సమయంలో జనగణన ఎన్యుమరేషన్ విధులు కూడా ప్రారంభం కావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ ముందు ఒక కీలక ప్రశ్న నిలిచింది.. “జనగణనకు ప్రాధాన్యం ఇవ్వాలా..? లేక విద్యార్థుల తరలింపుకు ప్రాధాన్యం ఇవ్వాలా..?”
సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభకు సుమారు 20 వేల మంది విద్యార్థులను సమీకరించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకురావాలని సూచించారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం నాలుగు వేల మంది విద్యార్థులు ఉండేలా చూడాలని ఆదేశాలు వెళ్లాయి.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంవత్సరం ముగిసింది. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. విద్యార్థులు చాలా మంది తమ బంధువుల ఇళ్లకు, గ్రామాలకు వెళ్లిపోయారు. కొందరు కుటుంబాలతో పర్యటనల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో వారిని తిరిగి సంప్రదించి సభకు రప్పించడం ఉపాధ్యాయులకు సవాలుగా మారింది.
ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక బోధనేతర పనులతో సతమతమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల విధులు, ఓటరు నమోదు, సంక్షేమ పథకాల సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో టీచర్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే జాబితాలో విద్యా వారోత్సవాల కోసం విద్యార్థుల సమీకరణ కూడా చేరింది.
అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. సోమవారం నుంచే జనగణన ఎన్యుమరేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, జనాభా విశ్లేషణ, వనరుల పంపిణీ వంటి అంశాల్లో జనగణనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగానికి అత్యంత కీలకమైనది. అలాంటి బాధ్యతలను నిర్వహించాల్సిన టీచర్లను ఇప్పుడు విద్యార్థుల సమీకరణ పనుల్లో నిమగ్నం చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జనగణన అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. దేశ భవిష్యత్ ప్రణాళికలకు పునాది వేసే మహత్తర ప్రక్రియ. గ్రామీణాభివృద్ధి నుంచి పట్టణ ప్రణాళికల వరకు, విద్య నుంచి ఆరోగ్య రంగం వరకు ప్రతీ నిర్ణయంలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ప్రక్రియలో నిమగ్నం కావాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఫోన్ కాల్స్ చేస్తూ విద్యార్థులను సభలకు ఆహ్వానించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలు పెంచుతోంది.
టీచర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక హెచ్‌ఎం స్కూల్ కమిటీ సభ్యులకు ఫోన్ చేస్తే “ఎండలో ఏం మీటింగ్.. పనికి వెళ్తే రూ.250 వస్తాయి.. మేం రాం” అని నేరుగా చెప్పినట్లు సమాచారం. మరికొందరు విద్యార్థులు “మేం బంధువుల ఇళ్లకు వెళ్లిపోయాం.. రాలేం” అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో మండలానికి రెండు బస్సులు ఏర్పాటు చేసినా ఒక్క బస్సు కూడా నిండే పరిస్థితి కనిపించడం లేదని టీచర్లు చెబుతున్నారు.
ఈ పరిణామాలు విద్యా వారోత్సవాలపై ప్రజల్లో ఆసక్తి లేదనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి బలవంతంగా జనాన్ని సమీకరించాలనే ధోరణి ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా తీవ్ర ఎండల సమయంలో చిన్నారులను సభలకు తరలించడం తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
వేసవి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్న సమయంలో విద్యార్థులను గంటల తరబడి బస్సుల్లో తరలించడం ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే హీట్‌వేవ్ హెచ్చరికలు కొనసాగుతున్న తరుణంలో పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సభలు నిర్వహించడం సరైన నిర్ణయమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యా వారోత్సవాల ఉద్దేశం విద్యపై అవగాహన పెంచడం కావచ్చు. ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని ప్రజలకు చూపించడం కావచ్చు. కానీ వాటి నిర్వహణ పద్ధతి ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఉండకూడదు. విద్యార్థుల భద్రత, టీచర్ల పనిభారం, ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్నింటినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది.
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే జనగణన వంటి జాతీయ ప్రాధాన్య కార్యక్రమం కంటే సభలకు జనాన్ని సమీకరించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు.. “ముందు జనగణన చేయాలా..? లేక సభల కోసం విద్యార్థులను వెతకాలా..?”
ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. కానీ బలవంతపు సమీకరణలు, అధికార ఒత్తిళ్లు, వేసవి కష్టాలు ప్రజల్లో వ్యతిరేక భావనను పెంచే ప్రమాదం ఉంది. విద్యా వారోత్సవాలు నిర్వహించాలంటే ముందుగా సమయం, పరిస్థితులు, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల బాధ్యతలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
