రాజర్షి సాహు మహారాజ్ 152వ జయంతి

సామాజిక చైతన్యానికి నిలువుటద్దం: రాజర్షి సాహు మహారాజ్ – 152వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం


నేడు జూన్ 26. భారతదేశ సామాజిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వెయ్యేళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వమే ఊపిరిగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి, రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ 152వ జయంతి. ఆనాటి సనాతన ధర్మం పేరుతో సాగిన బ్రాహ్మణ ఆధిపత్య పీడనాన్ని ప్రశ్నిస్తూ, బహుజన సమాజానికి ఆత్మగౌరవాన్ని అందించిన ఆ మహనీయుని జీవితం నేటికీ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి.

భారతదేశ చరిత్ర పుటలను తిరగేసినప్పుడు ఎందరో రాజులు, సామ్రాజ్య నిర్మాతలు కనిపిస్తారు. కానీ, రాజ్యం అంటే భోగభాగ్యాల కోసం కాదు, అది పీడిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి అని నిరూపించిన మహనీయుడు కోల్హాపూర్ సంస్థానాధీశుడు రాజర్షి సాహు మహారాజ్. బ్రిటీష్ పాలనలో, కుల వివక్ష, అజ్ఞానం, అంటరానితనం అనే చీకటి కోణాల్లో మగ్గుతున్న సమాజాన్ని చూసి చలించిపోయిన ఆయన, వెలుగు వైపు అడుగులు వేయించిన సమాజ శిల్పి. నేడు మనం మాట్లాడుకునే సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, విద్య అందరికీ సమానం అనే భావనలకు ఆనాడే పునాది వేసిన ధీరోదాత్తుడు ఆయన. ఆయన 152వ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకోవడం మన బాధ్యత.

ఒక సామాన్య బాలుడు అసామాన్య పరిణామం


1874 వ సంవత్సరం జూన్ 26 వ తేదీన కాగల్‌లోని ఒక సాధారణ ఘాట్గే కుటుంబంలో యశ్వంతరావుగా జన్మించిన ఆయన, విధి నిర్ణయం మేరకు కోల్హాపూర్ సంస్థానపు వారసుడిగా మారారు. 1894లో ఆయన పట్టాభిషేకం జరిగింది. అప్పటికే కోల్హాపూర్ సంస్థానంలో పాత తరం ఆలోచనలు, మూఢనమ్మకాలు వేళ్లూనుకొని ఉన్నాయి. కానీ, సాహు మహారాజ్ అడుగు పెట్టగానే ఆ వాతావరణం మారిపోయింది. గద్దెపై కూర్చున్న రాజుగా కాకుండా, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక ఆశ్రయంగా ఆయన మారారు. ఆయన పాలనలో మొదటి పది ఏళ్లు సంస్థానాన్ని ఆధునీకరించడానికి, తదుపరి కాలం సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి అంకితం చేశారు.

విద్యే విముక్తికి తొలి అడుగు


అజ్ఞానమే అనర్థాల మూలం అనేది సాహు మహారాజ్ నమ్మకం. సమాజంలోని అట్టడుగు వర్గాలు విద్యకు దూరంగా ఉండటం వల్లనే అణచివేతకు గురవుతున్నారని ఆయన గ్రహించారు. 1917లో ఆయన కోల్హాపూర్‌లో తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం భారతదేశ చరిత్రనే మార్చేసింది. అదేమిటంటే, ప్రాథమిక విద్యను నిర్బంధ మరియు ఉచిత విద్యగా ప్రకటించడం. పిల్లలను పాఠశాలలకు పంపని తల్లిదండ్రులకు జరిమానా విధించే చట్టాన్ని ఆనాడే అమలు చేశారు. కేవలం పాఠశాలలే కాదు, విద్యార్థుల వసతి కోసం మతం, కులం ప్రాతిపదికన కాకుండా, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేలా 12కు పైగా వసతి గృహాలను నిర్మించారు. విద్య లేనిదే ఏదీ సాధ్యం కాదు అని నమ్మిన ఆయన, వీరశైవ, జైన్, ముస్లిం, మరాఠా, పంచాళ ఇలా అన్ని వర్గాల విద్యార్థులను అక్కున చేర్చుకున్నారు. నేటి తరం విద్యార్థులకు, ఆనాటి విద్యార్థులకు సాహు మహారాజ్ ఒక గొప్ప స్ఫూర్తి.

రిజర్వేషన్ల పితామహుడు – సామాజిక న్యాయం


నేడు రిజర్వేషన్ల గురించి ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ, 1902లోనే ఒక రాజుగా, వెనుకబడిన వర్గాలకు 50 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చేసిన ప్రకటన ఒక సామాజిక విప్లవం. ఆనాడు ఉన్నత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా, ఆయన వెనక్కి తగ్గలేదు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం లభించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అని ఆయన నమ్మారు. అందుకే, ఆయనను భారతీయ రిజర్వేషన్ల పితామహుడిగా మనం గౌరవించుకుంటాం.

అంటరానితనంపై యుద్ధం


అంటరానితనం అనేది మానవత్వానికే మచ్చ అని భావించిన సాహు మహారాజ్, దానిని నిర్మూలించేందుకు ఎన్నో సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. సవర్ణ పిల్లలు, దళిత పిల్లలు కలిసి చదువుకోవాలనే నిబంధనను 1919లో కఠినంగా అమలు చేశారు. అణగారిన వర్గాల ప్రజలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారు. గంగాధర్ కాంబ్లే వంటి దళిత వ్యక్తులకు ఆర్థిక సాయం చేసి, వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహించడం ఆ రోజుల్లో చిన్న విషయం కాదు, ఒక గొప్ప సాహసం. మనుషుల మధ్య గోడలు కట్టే కుల వ్యవస్థను, అంతర్జాతి వివాహాలను ప్రోత్సహించడం ద్వారా ఆయన కూల్చివేశారు.

రైతు బాంధవుడు – వ్యవసాయ విప్లవం


రాజ్యం కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదు, గ్రామీణ రైతులు బాగుపడాలని ఆయన ఆకాంక్షించారు. 1896లో వచ్చిన కరువు కాలంలో ఆయన ప్రజలకు అందించిన అండ మరవలేనిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్మించిన రాధానగరి డ్యామ్ నేటికీ వేలాది ఎకరాలకు జీవనాధారంగా ఉంది. రైతుల కోసం సహకార సంఘాలు, వ్యాపార కేంద్రాలు, తక్కువ వడ్డీకే రుణాలు – ఇలా రైతుల కష్టాలను అర్థం చేసుకున్న పాలకుడిగా ఆయన నిలిచారు.

డా. అంబేడ్కర్ తో అనుబంధం – స్ఫూర్తిదాయకం


డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ మేధస్సును గుర్తించిన తొలి వ్యక్తుల్లో సాహు మహారాజ్ ఒకరు. డా. అంబేడ్కర్ విద్యకు, ఆయన పత్రికా నిర్వహణకు ఆర్థిక సాయం అందించడం వెనుక ఉన్నది కేవలం సహాయం కాదు, ఒక గొప్ప నాయకుడిని నిర్మించాలనే ఆశయం. మాన్‌గావ్ సమావేశంలో డా. అంబేడ్కర్ ను దళిత వర్గాల అగ్రనేతగా ప్రపంచానికి పరిచయం చేస్తూ, “భవిష్యత్తులో ఈయన మీకు మార్గదర్శనం చేస్తారు” అని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి.

స్త్రీ విముక్తి – సమ సమాజ నిర్మాణం


స్త్రీలను కేవలం ఇంటికే పరిమితం చేసే ఆ కాలంలో, వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం, దేవదాసీ పద్ధతిని నిషేధించడం ద్వారా స్త్రీలకు గౌరవాన్ని కల్పించారు. స్త్రీ విద్యకు, సమాన హక్కులకు ఆయన ఒక గొప్ప రక్షణ కవచంలా నిలిచారు.

నేటి పాలకులు నేర్చుకోవాల్సిన పాఠం


సామ్రాట్ అశోకుని వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సాహూ మహారాజ్, మతతత్వాన్ని, కుల వివక్షను ఎదిరించి లౌకికవాదాన్ని బతికించారు. కేవలం ఒక కులానికో, వర్గానికో కాకుండా.. న్యాయం వైపు, మెజారిటీ ప్రజల వైపు నిలబడటమే ఒక పాలకుని అసలైన ధర్మమని ఆయన నిరూపించారు. నేడు రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే నాయకులు, ప్రజా సేవ అంటే ఏమిటో సాహూ మహారాజ్ జీవితం నుండి నేర్చుకోవాలి.
వ్యవసాయ రంగంలో రాధానగరి ఆనకట్ట నిర్మాణం, పరిశ్రమల స్థాపన, సహకార ఉద్యమం ద్వారా రైతులకు అండగా నిలవడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలు. శ్రమించే ప్రతి వ్యక్తికి గౌరవం లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని ఆయన బలంగా నమ్మారు.

మహారాజుల మహారాజు


సాహు మహారాజ్ పాలనలో ప్రజా సేవ అనే భావనకు కొత్త అర్థం దక్కింది. మత, కుల భేదాలు లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు ప్రేరణ. 1922 మే 6న ఆయన కన్నుమూసినా, ఆయన వేసిన బాటపైనే నేటి సామాజిక ఉద్యమాలు సాగుతున్నాయి. మహారాజ్ ఒక రాజుగా పుట్టి, ఒక సంస్కర్తగా జీవించి, చివరకు అణగారిన వర్గాల గుండెల్లో ఒక దైవంగా నిలిచారు. ఆయన జీవితం మనందరికీ ఒక పాఠం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, సమాన అవకాశం లభించాలని ఆయన కోరుకున్నారు. ఆ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

152వ జయంతి జరుపుకుంటున్న ఈ తరుణంలో, సాహూ మహారాజ్ కన్న కలలను సాకారం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆయన ప్రతిపాదించిన విద్య, వైద్యం, ఉపాధి అనే త్రిసూత్ర పథాన్ని అమలు చేయడం ద్వారానే అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలం.
“అధికారం అనేది పీడించడానికి కాదు, పీడిత ప్రజలను పైకి తీసుకురావడానికి” అని నిరూపించిన రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్, బహుజన సమాజానికి ఎప్పటికీ నిలిచి ఉండే ధ్రువతార. ఈ జయంతి వేళ ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ, కులరహిత, సమసమాజ స్థాపనకు పునరంకితమవుదాం.


అరియ నాగసేన బోధి
M.A., M.Phil., TPT., LL.B
నవయాన సద్ధమ్మ ప్రచారకులు

You may also like...

Translate »