యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ)
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు బుధవారం తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)కు సమాచారం ఇచ్చింది. నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద 4 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి ప్లాంటుకు గతంలో ఒకసారి పర్యావరణ శాఖ ఈసీ జారీ చేసింది. అయితే ఈ ప్లాంటు నిర్మాణం వల్ల వెలువడే కాలుష్యంతో అమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందంటూ ఒక స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేసింది. దీనిపై విచారణ జరిపి మళ్లీ ఈసీ జారీ చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యావరణ, విద్యుత్ శాఖల అధికారులు ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి ఈఏసీకి నివేదిక పంపించారు. దాని ఆధారంగా తాజాగా మళ్లీ ఈసీ జారీకి అనుమతించింది. ఈ ప్లాంటు నిర్మాణాన్ని తొలుత రూ.25,099.42 కోట్ల వ్యయంతో ప్రారంభించగా ప్రస్తుతం అది రూ.34,542.95 కోట్లకు చేరింది. కాలుష్యం వెలువడకుండా పర్యావరణ పరిరక్షణకే రూ.5,681.44 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఈఏసీకి పంపిన ప్రతిపాదనల్లో జెన్కో తెలిపింది.అలాగే ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభమైన తరువాత ఏటా రూ.430.17 కోట్లను కాలుష్య నియంత్రణకు ఖర్చుపెడతామని వివరించింది. ఈ ప్లాంటులో 2 వేల మందికి నేరుగా.. మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఏటా ఈ ప్లాంటుకు కోటీ 40 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి గనుల నుంచి సరఫరా చేస్తారు. దీన్ని మండించి విద్యుదుత్పత్తి చేసినప్పుడు ఇందులో 30 శాతం బూడిద వెలువడుతుందని అంచనా. ఈ ప్లాంటుకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 14 సిమెంటు పరిశ్రమలకు ఈ బూడిదను ఎప్పటికప్పుడు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు జెన్కో నివేదికలో వివరించింది. పర్యావరణ పరిరక్షణకు ప్లాంటు చుట్టుపక్కల 45 ఎకరాల్లో 27,900 మొక్కలు నాటి పెంచుతున్నట్లు తెలిపింది. వచ్చే జూన్ కల్లా చుట్టూ వంద మీటర్ల పరిధిలో తుంగపాడు వాగుకు సరిహద్దు వెంట మూడు వరుసల్లో మొక్కలు నాటి పెంచనున్నట్లు తెలిపింది. చుట్టూ గ్రీన్‌బెల్ట్ ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందంటూ జెన్కో ఇచ్చిన నివేదికను కమిటీ ఆమోదించి ఈసీ జారీకి అనుమతించింది…..
