ఆర్టీసీ గుర్తింపు వివాదం.. ఈయూ మహాధర్నాకు టీఎంయూ మద్దతు
- కొల్లూరు ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి - October 25, 2026
- ఆర్టీసీ గుర్తింపు వివాదం.. ఈయూ మహాధర్నాకు టీఎంయూ మద్దతు - October 25, 2026
- హైదరాబాద్లో రూ.600కే వీక్లీ బస్ పాస్! - October 25, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణలో కార్మిక సంఘాల నిబంధనలను తుంగలో తొక్కారంటూ లేబర్ కమిషనర్ అధికారుల వైఖరిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు జాయింట్ లేబర్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొంతమంది స్వార్థప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాల కోడ్ ఆఫ్ డిసిప్లిన్ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని సంఘానికి గుర్తింపు కల్పించారని టీఎంయూ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీఎల్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జేఏసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంది.
కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియలో నిబంధనలు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని టీఎంయూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్ణయాలను నిరసిస్తూ అక్టోబర్ 28, 2026న ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టనున్న మహాధర్నాకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లకు చెందిన టీఎంయూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మహాధర్నాకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్మిక సంఘాల హక్కులు, గుర్తింపు ప్రక్రియలో నిబంధనల అమలు, అధికారుల నిర్ణయాలపై జవాబుదారీతనం వంటి అంశాలపై తమ నిరసనను తెలియజేయనున్నట్లు యూనియన్ వెల్లడించింది.
