2028 నాటికి పోలీసు ఖాళీలన్నీ భర్తీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు స్మారక పరేడ్‌ కార్యక్రమానికి సీఎం హాజరై అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదన్నారు. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మారుతున్న పరిస్థితులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నేరాల స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తన పనితీరును మెరుగుపరుచుకుంటోందని తెలిపారు.

పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు. 4,773 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. మిగిలిన ఖాళీలను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని, 2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థలో సిబ్బంది కొరతను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 112 మంది డీఎస్పీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసు ఉద్యోగుల పిల్లల విద్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసు పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను హోదా ఆధారంగా రూ.కోటికి పైగా పెంచినట్లు పేర్కొన్నారు. పోలీసుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

యువత మాదకద్రవ్యాలకు బానిసలవడం ఆందోళనకరమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి, నేరాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణలో రాష్ట్ర పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు. పోలీసు శాఖ పనితీరులో రాష్ట్రం జాతీయ స్థాయిలో తొలి స్థానం సాధించిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఆహార కల్తీని అరికట్టేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. టీజీ సేఫ్‌ ద్వారా కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ట్రాఫిక్‌ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ ప్రజా సేవలో భాగస్వాములను చేయడం అవసరమన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంపై మాట్లాడుతూ, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడమంటే నేరగాళ్ల పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం కాదని స్పష్టం చేశారు. బాధితులు, సామాన్యులు, అమాయకుల పట్ల పోలీసులు మర్యాదగా, సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో క్రిమినల్స్‌, భూకబ్జాదారులు, డ్రగ్స్‌ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీ ధోరణి ప్రదర్శించకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని, వారు చూపిన సేవా మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, శాంతిభద్రతలను కాపాడుతూ, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

You may also like...