భారత విద్యార్థులకు కెనడా భారీ స్కాలర్‌షిప్ అవకాశం

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులను ఎంపిక చేసి, వారు చదివే కోర్సు పూర్తయ్యే వరకు అవసరమైన పూర్తి విద్యా ఖర్చులను భరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నిర్వహించనుంది.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. “కెనడా–భారత్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ”లో భాగంగా ఈ ఫండ్ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యూహంలో భాగంగా భారత్‌లో మూడు హైబ్రిడ్ స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో బోధన, పరిశోధనలను ఈ కేంద్రాల్లో చేపట్టనున్నారు. దీని ద్వారా కెనడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ విద్యా, పరిశోధనా కార్యకలాపాలను విస్తరించనున్నాయి.
అదేవిధంగా ఇరు దేశాల విద్యాసంస్థల మధ్య మొత్తం 13 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా తిరుపతి ఐఐటీ, ఐసర్–తిరుపతితో కలిసి డల్హౌసీ యూనివర్సిటీ భారత్‌లో ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, మెక్‌గిల్ విశ్వవిద్యాలయాలు కూడా భారత్‌లో ఎక్స్‌లెన్స్ కేంద్రాలను స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ కార్యక్రమం భారత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను మరింత విస్తరించనుంది.
