గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్

—నాని రత్నం,సబ్ ఎడిటర్,స్టేట్ బ్యూరో: 70139 69403
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- ముందుగా పంచాయతీ ఎన్నికలు
- మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యం
- రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కోసం ప్రభుత్వం ఎదురుచూపులు
- గ్రామీణాభివృద్ధి నిధుల కోసం ఎన్నికల నిర్వహణ తప్పనిసరి
- ఇద్దరు పిల్లల నిబంధనకు గుడ్‌బై – అభ్యర్థులపై ఉన్న అడ్డంకి తొలగింపు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను మాత్రం మరింత కాలం వాయిదా వేయాలని కేబినెట్ స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇంకా రాకపోవడంతో పెద్దస్థాయి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే న్యాయసమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసే మూడు వేల కోట్లకు పైబడిన నిధులను అందుకోవాలంటే తప్పనిసరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో డిసెంబరు నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. పంచాయతీలకు సంబంధించిన ఈ ఎన్నికలను ముందుగా నిర్వహించడం సౌకర్యంగా ఉంటుందని అధికారులు నివేదించినట్లు సమాచారం.
ఇకపోతే, ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల పరిమితి నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ నిబంధన కారణంగా అనేక మంది నేతలు పోటీలో నిలబడలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేయడం చాలా మందికి ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజా ప్రతినిధుల ఎంపికలో ఇలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో దాఖలైన కేసులు ఇంకా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే ముందు హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది. రిజర్వేషన్లు తేలక ముందే ఈ ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఇందుతో ప్రభుత్వం ముందుగా గ్రామీణ స్వయం పాలనకు సంబంధించిన పంచాయతీ వ్యవస్థను పునర్నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా చేపట్టే ముందు రాజకీయ పార్టీల స్పందన, బీసీ సంఘాల డిమాండ్లు, న్యాయస్థాన తీర్పు—ఇవి అన్ని నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రాబోయే రోజులలో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం.
