డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

- హాస్టల్‌లో విషాదం
- అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్
నాగర్‌కర్నూలు,అక్టోబర్ 27 (జ్ఞాన తెలంగాణ):
నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది.అమ్మ నాన్న నన్ను క్షమించండి… మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంటూ సూసైడ్ లేఖ రాసి పురుగుమందు తాగిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన స్థానికులను కలచివేసింది.వివరాల్లోకి వెళితే, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న స్ఫూర్తి (21), కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి గ్రామానికి చెందినది. గత కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగినట్లు తెలుస్తోంది.తర్వాతి ఉదయం తోటి విద్యార్థులు స్ఫూర్తి అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. అక్కడినుంచి హుటాహుటిన ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ, విద్యార్థినీ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్ఫూర్తి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. వ్యక్తిగత సమస్యలేనా, లేక విద్య సంబంధిత ఒత్తిడేనా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్‌లో భద్రతా లోపాలు ఉన్నాయా అనే అంశంపైనా విచారణ జరుగుతోంది.ఈ సంఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మా పిల్లలు హాస్టల్లో సురక్షితంగా ఉన్నారా?” అనే ప్రశ్న మళ్లీ తలెత్తింది. స్ఫూర్తి పరిస్థితి స్థిరపడాలని అందరూ కోరుకుంటూ, ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
