బోనాలు-2026కు ఏర్పాట్లు

- ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం
- భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
- ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
- పారిశుధ్యం, ప్రజా సౌకర్యాల విస్తరణ
- అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి,జూన్ 24:
బోనాలు-2026 ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, నవీన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దయానంద్‌తో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవమని, ఈ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఏనుగు ఊరేగింపునకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఏనుగు సంచరించే మార్గాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. పండుగ సమయంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత విస్తరించాలని పోలీసు శాఖకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిరంతర నిఘా ఉంచాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణపై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని, అవసరమైన చోట్ల అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల పరిసర ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, భక్తులు ఎక్కువగా చేరుకునే ప్రాంతాల్లో నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, అదనపు పారిశుధ్య కార్మికులను నియమించడం, పండుగ కాలమంతా పరిశుభ్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక అంబులెన్సులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పోలీసు, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాల సమయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవలు అందించాలని సూచించారు. బోనాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని, ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారం, అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో బోనాలు-2026 ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
