హోర్ముజ్ జలసంధిపై అమెరికా అల్టిమేటం..

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా సురక్షితంగా, అందుబాటులో ఉంటుందని 24 గంటల్లోగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా స్పష్టం చేసినట్లు సమాచారం. వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు జరగవని ఇరాన్ అధికారికంగా హామీ ఇవ్వాలని, లేకపోతే తీవ్ర సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఈ హెచ్చరికను అమెరికా మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు చేరవేసినట్లు సమాచారం. వాణిజ్య నౌకలపై కాల్పులు, దాడులు వెంటనే నిలిపివేస్తామని ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గత పరిణామాలపై తమ వైఖరిలో మార్పు వచ్చిందనే సంకేతాన్ని కనీసం పరోక్షంగానైనా ఇవ్వాలని కూడా అమెరికా సూచించినట్లు తెలుస్తోంది.

అమెరికా అధికారుల వ్యాఖ్యల ప్రకారం.. “వాణిజ్య నౌకలపై కాల్పులు ఆపేస్తామని ఇరాన్ అధికారికంగా ప్రకటించాలి. జరిగిన పరిణామాలపై కనీసం పరోక్షంగానైనా బాధ్యతను అంగీకరించాలి. రేపటి ప్రకటనలో కాల్పులు ఆగుతాయని స్పష్టంగా చెప్పాలి. అలా చేయకపోతే వారికి అది మంచి రోజు కాబోదు” అని హెచ్చరించినట్లు సమాచారం.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ నెలకొనే ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒమాన్‌లో మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

అయితే అమెరికా నిర్దేశించిన గడువులోగా ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా సైనిక, ఆర్థిక చర్యలను మరింత కఠినతరం చేసే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. దీంతో హోర్ముజ్ జలసంధిలో తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, చమురు మార్కెట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఒమాన్ చర్చల ఫలితం, అనంతరం ఇరాన్ విడుదల చేసే అధికారిక ప్రకటనపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.

You may also like...