త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి

మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం: త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి
నేడు ఈ దేశ అణగారిన కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక విప్లవ సారథి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ గారి ధర్మపత్ని మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి. నేడు మనం అనుభవిస్తున్న హక్కులు, చదువులు, గౌరవప్రదమైన జీవితాల వెనుక బాబాసాహెబ్ పడిన శ్రమ ఎంత ఉందో, ఆ బాబాసాహెబ్ వెనుక నిలిచి తన జీవితాన్నే దారపోసిన రమాబాయి త్యాగం అంతకంటే మిన్నగా ఉంది. మా కోసం, మా ఉజ్వల భవిష్యత్తు కోసం తన కన్నపిల్లలను ఒక్కొక్కరిగా కోల్పోతూ కూడా, సమాజ శ్రేయస్సుకై భర్తను అప్పగించిన ఆ మాతృమూర్తిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కనీస కర్తవ్యం.
బాల్యం – బాధ్యతల బరువు
మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతమైన దాబోల్ సమీపంలోని ‘వణంది’ అనే చిన్న గ్రామంలో 1898 ఫిబ్రవరి 7వ తేదీన ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించారు రమాబాయి. చిన్నతనంలో ఆమెను అందరూ ఎంతో ముద్దుగా ‘రామీబాయి’ అని పిలుచుకునేవారు. ఆమె బాల్యం ఏమంత సుఖంగా సాగలేదు. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో, తండ్రి భికూ ధూత్రే నలుగురు బిడ్డల బాధ్యతను భుజాన వేసుకున్నారు. సముద్రతీరంలో చేపల బుట్టలను మోస్తూ, ఆ కష్టార్జితంతో కుటుంబాన్ని సాకే ప్రయత్నంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. గుండెనొప్పితో తండ్రి కూడా కన్నుమూయడంతో నలుగురు బిడ్డలు ఒక్కసారిగా అనాథలయ్యారు. ఆ సమయంలో రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ఆ పిల్లలను చేరదీశారు. ముంబైలో ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ వారిని పెంచసాగారు. రమాబాయి అక్క గౌరీబాయి, చెల్లెలు మీరాబాయి, తమ్ముడు శంకర్ లతో కలిసి ఆ కుటుంబం ముంబై చౌల్ జీవితంలోకి అడుగుపెట్టింది.
చేపల మార్కెట్లో జరిగిన చారిత్రాత్మక పరిణయం
గౌరీబాయికి వివాహం జరిగిన తర్వాత, రమాబాయికి కూడా వివాహం నిశ్చయించాలనే ఆలోచనలో చిన్నాన్న శంకర్ ధూత్రే ఉన్నారు. అదే సమయంలో, సుబేదార్ రామ్ జీ సక్పాల్ మాలోజీ తన చదువరుడైన కుమారుడు భీమ్రావ్ (అంబేడ్కర్) కొరకు ఒక మంచి సంబంధాన్ని అన్వేషిస్తున్నారు. భీమ్రావ్ ప్రాథమిక విద్య సాగిన దాబోల్ పరిసర ప్రాంతాల్లోనే సంబంధాల కోసం వెతుకుతుండగా, సుబేదార్ కంటికి రమాబాయి కనిపించింది. ఆమెలోని అణకువ, గుణగణాలు, కష్టపడే స్వభావాన్ని గమనించిన రామ్ జీ సక్పాల్, ఈమె తన కుమారుడికి తగిన జోడి అని భావించి సంబంధం ఖాయం చేసుకున్నారు.
ఆ విధంగా 1908లో ముంబై నగరంలోని భాయ్‌ఖలా సబ్ స్టేషన్ పరిధిలో గల ఒక చేపల మార్కెట్లో రాత్రి వేళ వీరి వివాహం జరిగింది. ఒకవైపు చేపల కంపు, మరొకవైపు మురికి నీరు ప్రవహిస్తున్న ఆ దీన వాతావరణంలో, పేదరికపు అంచుల్లో ఆ పరిణయ వేడుక సాగింది. అప్పటికి హిందూ సమాజంలో ఉన్న అగ్రవర్ణాల బాల్య వివాహాల సాంప్రదాయ ప్రభావం కింది వర్ణాలపై కూడా బలంగా ఉండేది. మురికి పైనుండి కిందికి ప్రవహించినట్లుగానే, ఈ ఆచారాలు కింది స్థాయికి చేరాయి. వివాహ సమయానికి రమాబాయి వయస్సు కేవలం 9 సంవత్సరాలు కాగా, అంబేడ్కర్ వయస్సు 16 సంవత్సరాలు.

ఐదుగురు సంతానం – నలుగురి మరణం తెచ్చిన తీరని వేదన
1924 నాటికి బాబాసాహెబ్ మరియు రమాబాయి దంపతులకు ఐదుగురు సంతానం జన్మించారు. వారు: యశ్వంత్ రావు, గంగాధర్, రమేశ్, ఇందు, మరియు రాజారత్న. అయితే, కాలం ఆ తల్లికి కడుపుకోతనే మిగిల్చింది. జేష్ఠ పుత్రుడైన యశ్వంత్ రావు మినహా, మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల ప్రాయంలోనే తీవ్రమైన రక్తహీనత, సరైన పోషకాహారం లేక కళ్ళ ముందే ప్రాణాలు విడిచారు. ఆ దారిద్ర్యం, పిల్లల మరణాలు రమాబాయి గుండెల్లో తీరని వేదనను నింపాయి.
పెద్దవాడైన యశ్వంత్ రావు కూడా చిన్న వయసులోనే పోలియో బారిన పడి వైకల్యంతో బాధపడ్డాడు. అందరిలోకి చిన్నవాడైన రాజారత్న అంటే రమాబాయికి పంచప్రాణాలు. ఎంతో ముద్దుగా, గారాబంగా ఆ బిడ్డను చూసుకునేది. తొమ్మిది నెలల పాటు ఆ పసికందుకు రాత్రింబవళ్లు సపర్యలు చేసింది. కానీ, దేవుడు ఆ బిడ్డను కూడా ఉంచలేదు. 1926 జూలై 19వ తేదీన రాజారత్న నిమోనియా వ్యాధితో కన్నుమూశాడు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, చివరికి మాతా రమాబాయి కూడా అదే రక్తహీనత (Anemia) వ్యాధి బారిన పడి మరణించింది. సమాజం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం.
బాబాసాహెబ్ చదువుకు వెన్నుముక
బాబాసాహెబ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, ఇక్కడ కుటుంబ భారాన్ని ఒంటరిగానే మోసింది రమాబాయి. కడు పేదరికం అనుభవిస్తున్నా, ఎవరి ముందూ చేతులు చాచలేదు. కుట్టు మిషన్ కుడుతూ, పేడ ఏరి పిడకలు చేసి అమ్ముతూ ఆ చిన్న సంసారాన్ని నెట్టుకొచ్చింది. ఈ విషయాన్ని బాబాసాహెబ్ తన “థాట్స్ ఆన్ పాకిస్తాన్” (Thoughts on Pakistan) అనే గ్రంథంలో ఎంతో ఆవేదనతో గుర్తుచేసుకున్నారు.
తన బిడ్డలు వైద్యానికి డబ్బుల్లేక కళ్ళ ముందే చనిపోతున్నా, ఏనాడూ ఆమె బాబాసాహెబ్ చదువుకు కానీ, ఆయన నడుపుతున్న సామాజిక పోరాటాలకు కానీ అడ్డు నిలవలేదు. “నేను విదేశాల్లో ఉన్నప్పుడు నా ఇల్లు, కుటుంబం కోసం అన్ని బాధలు సహించిన రమాబాయి, నేను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ కష్టాలను చిరునవ్వుతో భరించింది. తలపై పెట్టుకున్న ఆ పేడ తట్టును దించి, వెనుకా ముందూ చూసి తలవంచే ప్రయత్నం ఆమె ఎన్నడూ చేయలేదు. అంతటి మమతా మూర్తి, సుశీలమతి అయిన రమాబాయితో రోజులోని 24 గంటలలో కనీసం అర్థగంట కూడా నేను గడపలేకపోయానే” అని బాబాసాహెబ్ తన డైరీలో వ్రాసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
లొంగని ఆత్మగౌరవం – నిరాడంబరత
1928 ఫిబ్రవరి 3న బాబాసాహెబ్ “బహిష్కృత్ భారత్” పక్ష పత్రికలో వ్రాసిన ఒక సంపాదకీయం రమాబాయి యొక్క నిరుపమానమైన ఆత్మగౌరవానికి అద్దం పడుతుంది. బాబాసాహెబ్ మిత్రులు ఎందరో ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చినా, రమాబాయి వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఒక సందర్భంలో బాబాసాహెబ్ సోదరుడు బలరాం ఒక చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఇంట్లోని దీన స్థితిని గమనించి అందరికీ కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. రమాబాయిని కూడా ఒక మంచి చీర కొనుక్కోమన్నారు. కానీ, రమాబాయి ఆ డబ్బుతో తన కోసం చీర కొనలేదు; విదేశాల నుండి తిరిగి రాబోతున్న తన భర్త కొరకు ఒక జత ధోవతులు, ఒక పరుపు, దిండు, అన్నం తినేటప్పుడు కూర్చోవడానికి ఒక చెక్క పీట కొని దాచింది. తన వ్యక్తిగత సుఖాల కంటే భర్త అవసరాలకే ఆమె ప్రథమ ప్రాధాన్యతనిచ్చింది.

సాహెబ్ – రామూల అనుబంధం
రమాబాయి అక్షరాస్యురాలు కాదు, కానీ ఆమె ఆలోచనా విధానం ఎంతో పరిణతి చెందింది. బాబాసాహెబ్ ఆమెను ఎంతో ప్రేమగా “రామూ” అని పిలిచేవారు, రమాబాయి తన భర్తను అత్యంత గౌరవంతో “సాహెబ్” అని సంబోధించేది. వారి బంధం కేవలం భార్యాభర్తల బంధం కాదు; అది నమ్మకం, త్యాగం, పరస్పర గౌరవంతో ముడిపడిన ఒక పవిత్ర బంధం. తన భర్త ఏడు కోట్ల అణగారిన ప్రజల విముక్తి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడని, ఈ దేశ చరిత్రను మార్చే మహత్కార్యంలో ఉన్నాడని ఆమె గర్వపడేది. బాబాసాహెబ్ ఆమెకు అక్షరాలు నేర్పే ప్రయత్నం చేసినా, ఆమె ఇంటి బాధ్యతలకే పరిమితమై, సాహెబ్ చదువుకోవడానికి వీలుగా డబ్బులు దాచేది. సాహెబ్ చేతిలో పెట్టిన ప్రతి యాభై రూపాయలను, రోజుకు రూపాయిన్నర చొప్పున ముప్పై పొట్లాలుగా కట్టి, నెలకు సరిపడా ప్రణాళికతో సంసారాన్ని నడిపిన మహా సాధ్వి ఆమె.
హృదయ నైర్మల్యం – గాంధీజీ ప్రాణభిక్షలో పాత్ర
నిమ్న జాతుల వారికి రాజకీయ హక్కులను కల్పించే “కమ్యూనల్ అవార్డ్” (Communal Award) కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భంలో, దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీజీ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయన ప్రాణాలు కాపాడాలని కస్తూరిబా గాంధీ, సరోజినీ నాయుడు తదితరులు ముంబైలోని అంబేడ్కర్ నివాసానికి వచ్చి ప్రార్థించారు. ఈ విషయం తెలిసిన రమాబాయి హృదయం ద్రవించింది. ఆమె బాబాసాహెబ్ వద్దకు వెళ్లి, “ఎలాగైనా గాంధీ గారి ప్రాణాలు కాపాడండి, ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. కస్తూరిబాకు పతిభిక్ష పెట్టండి” అని ప్రాధేయపడింది. అప్పుడు బాబాసాహెబ్ “రామూ! వేల సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతున్న మన ప్రజల హక్కులను గాంధీ తన దీక్షతో లాగేసుకోవాలని చూస్తున్నాడు” అని వివరించినా, ఆమెలోని కరుణామయ హృదయం ఒక స్త్రీ కంటితడిని చూడలేకపోయింది. రమాబాయి అభ్యర్థన కూడా బాబాసాహెబ్ పూనా ఒప్పందానికి (Poona Pact) అంగీకరించేలా చేయడంలో ఒక మానవీయ కోణంగా నిలిచింది.
అంటరానితనం సృష్టించిన గాయం
రమాబాయికి తన జీవితంలో ఒక్కసారైనా పండరీపురం వెళ్లి విఠోభా దేవుడిని దర్శించుకోవాలని బలమైన కోరిక ఉండేది. భార్య చివరి కోరికను తీర్చడం కోసం బాబాసాహెబ్ ఆమెను పండరీపురం తీసుకువెళ్లారు. కానీ, అంటరానితనం అనే మహమ్మారి అక్కడ కూడా వారిని వెంటాడింది. అస్పృశ్యులు అనే కారణంతో వారిని గుడిలోకి రానివ్వకుండా, వంద గజాల దూరం నుంచే దర్శనం చేసుకోవాలని అక్కడి అర్చకులు శాసించారు. ఆ అవమానానికి రమాబాయి గుడి బయటే నిలబడి ఎంతో ఆవేదనతో కన్నీరు కార్చింది. ఆ సంఘటనతో కలత చెందిన బాబాసాహెబ్, “తనను నమ్ముకుని వచ్చిన భక్తులను కనీసం దగ్గరకు కూడా రానివ్వని ఈ విఠోభా అసలు దేవుడే ఎలా అవుతాడు?” అని ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని అసమానతలపై తన పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు.
అంతిమ శ్వాస – సాహెబ్‌కు ఇచ్చిన సందేశం
నిరంతరం కష్టాలు, మానసిక వేదన, పోషకాహార లోపం కారణంగా రమాబాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 1935 మే 26 నాటికి ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. బొంబాయిలోని దాదర్ ‘రాజగృహ’ నివాసంలో మంచాన పడిన రమాబాయి, మే 27వ తేదీన తన 38వ ఏటనే కన్నుమూశారు. మరణానికి కొద్ది నిమిషాల ముందు ఆమె తన భర్తతో క్షీణించిన స్వరంతో ఇలా అన్నది:
“సాహెబ్! నా గురించి బాధపడకండి. వెలుపల ఉన్న మీ ఏడు కోట్ల మంది బిడ్డల గురించి శ్రద్ధ వహించండి. వాళ్లకు సేవ చేయడమే మీ లక్ష్యం. ఆ మహోన్నతమైన మార్గం నుండి మీరు ఎన్నడూ పక్కకు తప్పుకోవద్దు. వారికి సమాజంలో గౌరవమర్యాదలు కల్పించే బాధ్యత మీదే…”
ఆ మాటలు పలికి ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. రమాబాయి మరణంతో బాబాసాహెబ్ ఒక చిన్న పిల్లాడిలా రోదించారు. వారం రోజుల పాటు గదిలోనే ఉండిపోయి, దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఆ వైరాగ్యంతో ఆయన బౌద్ధ భిక్షువుగా మారిపోవాలని కాషాయ వస్త్రాలు (చీవరాలు) కూడా ధరించారు. కానీ, కోట్లాది మంది ప్రజల విముక్తి కోసం పోరాడాల్సిన బాధ్యతను మిత్రులు గుర్తుచేయడంతో ఆయన మళ్లీ కార్యాచరణకు సిద్ధమయ్యారు.
అక్షర నివాళి
రమాబాయి మరణించిన పదేళ్ల తర్వాత, 1945లో బాబాసాహెబ్ రాసిన “పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన” (Pakistan or the Partition of India) అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ఆమెకు అంకితం ఇస్తూ ఇలా వ్రాశారు:
“ప్రియమైన రామూకి! సాత్వికమైన ఆమె మనస్సు, ఆమెలోని మానసిక సద్భావనలు, పవిత్రమైన సదాచారాలు… దుఃఖభరితమైన ఆ దినాల్లో నాకు కొండంత అండగా నిలబడ్డాయి. అప్పుడు మాకు ఎవరూ సహాయం చేయలేదు. పేదరికం, కష్టాలు మమ్మల్ని నిలువునా దహిస్తున్నా, అత్యంత సహనశీలతతో, బలిదానంతో, త్యాగ నిరతితో నన్ను ముందుకు నడిపించిన ఆమె పవిత్ర స్మృతికి నా కన్నీటి నివాళి…”
మాతా రమాబాయి అంబేడ్కర్ కేవలం ఒక సామాన్య గృహిణి కాదు; ఆమె ఈ దేశ సామాజిక విప్లవానికి మూలస్తంభం. ఆమె త్యాగం లేకపోతే బాబాసాహెబ్ అంతటి ఉన్నత చదువులు చదువుకునేవారు కాదు, ఇంతటి విస్తృత పో్వరాటం సాధ్యమయ్యేది కాదు. నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మాతృమూర్తికి నా హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె త్యాగం ఈ దేశ అణగారిన వర్గాల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా ఉంటుంది.
👉 ”కోట్లాది మంది భవిత కోసం…
కన్నబిడ్డలను కోల్పోయి, కష్టాలను చిరునవ్వుతో మోసి,
బాబాసాహెబ్ పోరాటానికి వెన్నుముకగా నిలిచిన
త్యాగాల శిఖరం… మాతా రమాబాయి!”
✍️ అరియ నాగసేన బోధి
M.A., M.Phil., TPT., LL.B
నవయాన బౌద్ధ ధమ్మ ప్రచార కర్త
