అణుశక్తిలో భారత మరో మైలురాయి

జ్ఞాన తెలంగాణ, చెన్నై :
భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత శాస్త్రీయ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొంటూ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారత పౌర అణు ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక ఘట్టం. పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకున్న ఈ ఆధునిక రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం మన ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప ఉదాహరణ” అని తెలిపారు. ఈ రియాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది వినియోగించే అణు ఇంధనంకంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉందని వివరించారు.
ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అణు ఇంధన చక్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రియాక్టర్ ద్వారా యురేనియం వినియోగాన్ని పెంచడమే కాకుండా, ప్లుటోనియం ఉత్పత్తి చేసి భవిష్యత్ అణు ఇంధన అవసరాలను తీర్చేలా రూపొందించారు. ఇది భారత మూడు దశల అణు కార్యక్రమంలో రెండో దశకు చెందిన కీలక ప్రాజెక్ట్.
ఈ విజయంతో దేశ అణు కార్యక్రమం మూడో దశకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో విస్తారంగా లభ్యమయ్యే థోరియం నిల్వలను వినియోగించేందుకు ఇది కీలకంగా మారనుంది. థోరియం ఆధారిత అణుశక్తి ఉత్పత్తి ద్వారా దేశం దీర్ఘకాలిక ఇంధన భద్రతను సాధించగలదని అంచనా వేస్తున్నారు.
ఈ రియాక్టర్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడటం విశేషం. భారత అణు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎన్నో సంవత్సరాల కృషితో ఈ విజయాన్ని సాధించారు. ఇది దేశీయ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఘట్టంగా నిలిచింది.
ఈ విజయంతో అణుశక్తి రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లయింది. భవిష్యత్తులో శుద్ధ ఇంధన వనరుల విస్తరణ, శక్తి భద్రత సాధనలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది

You may also like...

Translate »