శంకర్‌పల్లి అభివృద్ధికి మరో ముందడుగు

రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం

శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం అత్యంత కీలకమని పేర్కొన్నారు. వర్షాకాలంలో మురుగునీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రతి వార్డులో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమర్థవంతంగా వినియోగిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేత పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు గణేష్, ఆనంద్, కో-ఆప్షన్ సభ్యుడు బాలకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

You may also like...