కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి రంగంలోకి

- ప్రచారాన్ని వేడెక్కించేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం
- యువతను ఆకట్టుకునే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పర్యటన
- రెండు రోజుల పాటు సభలు, రోడ్‌షోలతో ప్రచారం
- ఎర్నాకులం, హోసూరులో వ్యూహాలు పర్యవేక్షించనున్న శ్రీధర్ బాబు
- పతినంతిట్టలో ముమ్మర ప్రచారం చేపట్టిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ :
కేరళలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికారాన్ని చేజిక్కించుకోవడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ, ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ‘స్టార్ క్యాంపెయినర్’గా రంగంలోకి దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి వాగ్దాటి, మాస్ అప్పీల్ కేరళ ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ సాయంత్రం ఆయన కేరళకు బయలుదేరి వెళ్లి, రెండు రోజుల పాటు పలు బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టనున్నారు.
ఇక తెలంగాణకు చెందిన ఇతర కీలక నేతలు కూడా కేరళ ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఎర్నాకులం, హోసూరు ప్రాంతాల ఇన్చార్జిగా నియమితులైన శ్రీధర్ బాబు ఏప్రిల్ 7 వరకు అక్కడే మకాం వేసి ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించనున్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇప్పటికే పతినంతిట్ట జిల్లాలోని ఆడూర్, అరుణ్ముల నియోజకవర్గాల్లో ప్రచారాన్ని వేగవంతం చేశారు.
