భగవంతుని సన్నిధిలో గడిపితే మనసుకు ప్రశాంతత – ఉమ్రా యాత్రికులు

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్:
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చి భగవంతుని సన్నిధిలో గడిపితే హృదయంలోని చింతలన్నీ తొలగిపోతాయని ఉమ్రా యాత్ర నుంచి తిరిగివచ్చిన ఇస్లామిక్ మతస్థులు తెలిపారు. మక్కా, మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో గడిపిన రోజులు తమకు అపారమైన మానసిక ప్రశాంతతను అందించాయని వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 22వ తేదీన సౌదీ ఎయిర్‌లైన్స్ ద్వారా ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రకు బయలుదేరిన 50 మంది యాత్రికులు 15 రోజులపాటు మక్కా, మదీనాలలో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈరోజు వారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ అలీ మాట్లాడుతూ, సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మక్కా మదీనా వంటి పవిత్ర స్థలాలను దర్శించుకోవాలని సూచించారు. అక్కడ చేసే ప్రార్థనలు దైవచింతనను పెంపొందించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని అన్నారు. రాబోయే రంజాన్ నెల ఫిబ్రవరి 12న, అలాగే మార్చి 25న మరికొన్ని ఉమ్రా బృందాలు బయలుదేరనున్నట్లు తెలిపారు. అలాగే హజ్ యాత్ర కోటా పూర్తిగా నిండిపోయిందని వెల్లడించారు.
