ప్రజల చెంతకే చౌక ధర దుకాణం…

- చాకలిదానిగుట్ట తాండ ప్రజలకు తీరనున్న రేషన్ కష్టాలు
- కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి
- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ,నందిగామ ప్రతినిధి :ప్రజల అవసరాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిదానిగుట్ట తాండాలో నూతనంగా ఏర్పాటు చేసిన చౌకధర దుకాణం (రేషన్ షాప్)ను గ్రామ సర్పంచ్ గుబ్ర చౌహన్ ఆధ్వర్యంలో ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, మారుమూల తండాలు మరియు గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా, సమయానికి అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటివరకు రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, నూతన రేషన్ షాప్ ప్రారంభంతో ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తోందని వారు అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంజుల, తులసిరాం నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నర్సింలు, కుమారస్వామి గౌడ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తమ తాండాకు చౌకధర దుకాణం రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
