ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ
- ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ - June 30, 2026
- తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతల స్వీకారం - June 30, 2026
- అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు - June 30, 2026

ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ
- తెలంగాణ పెట్టుబడి అవకాశాలపై చర్చ
- విద్యా సంస్కరణలు, స్కిల్స్ యూనివర్సిటీపై వివరణ
- డేటా సెంటర్, ఏఐ పెట్టుబడులకు ఆహ్వానం
- ప్రభుత్వ పాఠశాలలకు స్కాలర్‌షిప్‌ల ప్రకటన
- హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌గా పరిశీలన
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థ బోధీ పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, పారదర్శక పాలన పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు.
విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడం, పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ వంటి కార్యక్రమాలను వివరించి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులను రాష్ట్రం సిద్ధం చేస్తోందని తెలిపారు.
సమావేశంలో చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి సునీల్ మిట్టల్‌ను కోరారు. అంతేకాకుండా తెలంగాణలో మరింత పెద్ద స్థాయిలో సమగ్ర డేటా సెంటర్‌తో పాటు కృత్రిమ మేధస్సు (AI) మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్‌ను డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం భారతీ గ్రూప్ నుంచి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సునీల్ భారతి మిట్టల్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. భారతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ఎయిర్‌టెల్‌కు రెండో ప్రధాన కార్యాలయంగా హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు ఆసక్తి ఉందని, తెలంగాణలో ఫైబర్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం–పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే దిశగా ఈ భేటీ కీలకంగా నిలిచిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి
