చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?

చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి :


తెలంగాణలో ‘SIR’ పేరుతో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్న BLOలు వాటిని నింపాలని చెబుతున్నా, చదువురాని వారు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫారంలో చిన్న పొరపాటు జరిగినా యాప్ అంగీకరించకపోవడంతో చదువుకున్నవారే ఇబ్బందిపడుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే సుమారు 89 లక్షల ఓటరు రికార్డుల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించగా, అందులో 16 లక్షల మందికి పేర్లలోనే తప్పులు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలపై మొత్తం బాధ్యత మోపడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది.

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాణం. ఆ హక్కును వినియోగించుకునే ప్రక్రియను ప్రజలకు సులభతరం చేయాల్సింది పోయి, క్లిష్టంగా మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, ఎన్నికల అధికారులు వెంటనే గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి ఫారాన్ని అధికారులే నింపి ధృవీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే, నిరక్షరాస్యులు, వృద్ధులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి

You may also like...