బీఆర్‌ఎస్‌లో డిజిటల్ విప్లవానికి కేసీఆర్ శ్రీకారం

  • సభ్యత్వ నమోదు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే.. 71 వేల మందికి శిక్షణ
  • ఆరు గంటల పాటు సాగిన కీలక సమావేశం
  • డిజిటల్ మెంబర్‌షిప్‌పై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం
  • ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తలతో ప్రత్యేక వ్యవస్థ
  • సభ్యత్వ నమోదు కోసం జిల్లా వారీగా ఇన్‌ఛార్జుల నియామకం
  • పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వ్యూహం

జ్ఞాన తెలంగాణ,ప్రత్యేక ప్రతినిధి:
బీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను పార్టీ నిర్మాణంలో భాగం చేసే దిశగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, డిజిటల్ వ్యవస్థల అమలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో డిజిటల్ ప్రక్రియలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కూడా పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR), ఓటరు జాబితాల సవరణ వంటి ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతున్నాయని, అదే తరహాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక సభ్యత్వ సమన్వయ కర్తలను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం పర్యవేక్షణ, శిక్షణ, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం వీరి బాధ్యతగా ఉండనుంది.
అలాగే ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీకి ప్రత్యేక సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ కమిటీలను నియమించి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 35,655 పోలింగ్ బూత్‌లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. డిజిటల్ వ్యవస్థలో సభ్యత్వ నమోదు చేయడం, వివరాల సేకరణ, డేటా నిర్వహణ, యాప్ వినియోగం, సభ్యుల ధృవీకరణ వంటి అంశాలపై ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సమాచారం.
పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సాధారణ కార్యక్రమంగా కాకుండా పార్టీ పునర్నిర్మాణానికి కీలక దశగా భావించాలని కేసీఆర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తదితర వర్గాలను పెద్దఎత్తున పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.


పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జులను కూడా నియమించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తక్కళ్లపల్లి రవీందర్ రావును ఇన్‌ఛార్జిగా నియమించగా, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు సత్యవతి రాథోడ్‌ను, జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు గ్యాదరి బాలమల్లుకు బాధ్యతలు అప్పగించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు గంగాధర్ గౌడ్‌ను, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నారదాసు లక్ష్మణ్ రావును ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రావుల శ్రావణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నియమించగా, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు మహమూద్ అలీకి బాధ్యతలు అప్పగించారు. గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు మెట్టు శ్రీనివాస్‌ను, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. హైదరాబాద్ జిల్లాకు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జులుగా నియమించారు.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత మార్పులు, రాబోయే ఎన్నికల వ్యూహం, గ్రామస్థాయి బలోపేతం, సోషల్ మీడియా వినియోగం, యువతను ఆకర్షించే కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కేసీఆర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. జిల్లా పర్యటనలు చేపట్టి క్యాడర్‌తో నేరుగా మమేకం కావాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూ పార్టీని ప్రజల్లో యాక్టివ్‌గా ఉంచాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలు వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన నిరుత్సాహాన్ని తొలగించి కొత్త ఉత్సాహాన్ని నింపడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీని సాంకేతికంగా మరింత బలోపేతం చేయడమే కాకుండా యువతను ఆకర్షించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

You may also like...

Translate »