హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026
- బెల్జియంపై విజయం.. ఫిఫా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి స్పెయిన్ - July 11, 2026
- ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం - July 11, 2026

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని హెచ్చరించారు. నిందితుడి కోసం రైల్వే పోలీసులు, ట్రాకింగ్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ బృందాలు కలిపి మొత్తం తొమ్మిది ప్రత్యేక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. రాజ్‌కుమార్ చేగురు రైల్వే ట్రాక్ దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో అడవుల్లో ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి 11:47 గంటలకు అతడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినట్లు సాంకేతిక దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు. మొబైల్ సిగ్నల్స్, సీసీటీవీ దృశ్యాలు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుడి కదలికలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కాడని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మరోసారి స్పష్టం చేసిన డీసీపీ, అధికారికంగా పోలీసులు వెల్లడించే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని సూచించారు. హంతకుడిని చట్టం ముందు నిలబెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడు ఎంతకాలం తప్పించుకున్నా తప్పించుకోలేడని స్పష్టం చేశారు.
