ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

  • విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: ఆకుల సతీష్

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:
పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పేట్ బషీర్‌బాద్ సర్వే నంబర్ 23లో సుమారు 5.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇందులో ఒక ఎకరా ప్రభుత్వ పాఠశాల కోసం, మరో భాగం పేదల అవసరాల కోసం, అలాగే సుమారు రెండు ఎకరాలు ట్రాఫిక్ డీసీపీ జోనల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం (No. LC3/2550/2007) కేటాయించబడినట్లు పేర్కొన్నారు.అయితే ఈ భూమికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 12, 24లో మైసా కన్స్ట్రక్షన్ (మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భాగస్వామ్య సంస్థ అని ఆరోపిస్తూ) భారీ నిర్మాణ పనులు చేపట్టిందని, సరైన 60 అడుగుల అప్రోచ్ రోడ్ లేకపోయినా జీహెచ్ఎంసీ అనుమతులు (No. 1/C25/03336/2020) మంజూరు చేసినట్లు ఆరోపించారు.2021లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు (560, 561, 562) పేరుతో GO No.117/2021 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని, అనంతరం ప్రభుత్వ భూమిలో నిర్మించిన ట్రాఫిక్ డీసీపీ కార్యాలయం 25-06-2023న కూల్చివేయబడిందని పేర్కొన్నారు. దీనిపై అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్రపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంబంధిత నిర్మాణానికి సరైన అప్రోచ్ రోడ్ లేకపోవడంతో హైకోర్టులో WP No.17205/2024 పెండింగ్‌లో ఉండగా, కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పూర్తి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో తారు రోడ్డు నిర్మించారనే ఆరోపణలు చేశారు మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు వద్ద సుమారు 1200 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందని గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ఇటీవల ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు, సంబంధిత ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని హైడ్రా కమిషనర్ కార్యాలయం నుంచి LR No. B/152/2026, Dt: 02-03-2026 ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన రహదారిపై విచారణ జరపాలి,ప్రభుత్వ భూమిని రక్షించాలి
అవసరమైతే పార్క్ లేదా ట్రాఫిక్ డీసీపీ కార్యాలయానికి కేటాయించాలి,మైసా కన్స్ట్రక్షన్‌కు ఇచ్చిన అనుమతులపై సమీక్ష చేయాలి గతంలో తీసుకున్న పరిపాలనా నిర్ణయాలపై విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్, పులి బలరాం, ఎల్ల స్వామి, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »