తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

  • తెలంగాణ వాటా జలాల కోసం సీఎం విజ్ఞప్తి
  • తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని డిమాండ్
  • ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులపై అసంతృప్తి
  • పూడిక తొలగింపుకు కేంద్రం, కర్ణాటక సహకారం అవసరం
  • తుంగభద్ర ఎత్తిపోతల పథకంపై ప్రత్యామ్నాయాల పరిశీలన

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:
తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్‌, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఐదు నుంచి ఆరు టీఎంసీలకు మించి అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణంగా ఆర్డీఎస్ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాలకు చెందిన 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందడం లేదని పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలి బండ డైవర్సన్ స్కీమ్ (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై జలసౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య నీటి వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ముఖ్యంగా తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను పూర్తిస్థాయిలో అందించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆర్డీఎస్ ఆనకట్ట ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, భద్రతా పరంగా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించి అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ప్యాకేజీ-3, ప్యాకేజీ-4 పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులను వెంటనే చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.
ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు భారీగా పూడిక పేరుకుపోవడంతో ఆశించిన స్థాయిలో నీటి మళ్లింపు జరగడం లేదని ఇంజనీర్లు వివరించారు. ఇప్పటికే 2004లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సిఫారసు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ సూచనలు అమలు కాలేదని సమావేశంలో చర్చించారు. పూడిక తొలగింపుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకుపోయిన ప్రాంతం కర్ణాటక భూభాగంలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారాన్ని కూడా కోరాలని నిర్ణయించారు. అలాగే 2004 నిపుణుల కమిటీ చేసిన అన్ని సిఫారసులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించి అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇక తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా తెలంగాణకు లభించే ప్రతి చుక్క నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి, సంబంధిత పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండబోదని, తుంగభద్ర జలాల విషయంలో తెలంగాణ హక్కులను సాధించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పోరాడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

You may also like...

Translate »