నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారు : బి. అశోక్

- ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: SCCWU–IFTU
జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అశోక్ తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదవ కాలనీ ఆర్జీ–టూ డివిజన్ పరిధిలోని జేఎం ఆఫీస్ ఏరియా, హౌస్కీపింగ్ బంగ్లా ఏరియా, సివిల్ తదితర విభాగాల్లో ఫిబ్రవరి 12న జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 29 చట్టాలుగా మార్చి, చివరకు కేవలం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాసిందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్లు పని గంటలు పెంచి, ఉద్యోగ భద్రతను తొలగించి, కార్మికులను పూర్తిగా యాజమాన్య ఆధీనంలోకి నెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ చట్టాల రద్దు కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ ఉపాధ్యక్షురాలు జే. నిర్మల, డివిజన్ కార్యదర్శి పి. రాజనర్సు, బండ పద్మ, బి. సమ్మక్క, గుండు పద్మ, వెంకటలక్ష్మి, ప్రేమ్ కుమార్, టి. మొండి దుర్గేష్, సమ్మయ్య, రవీందర్, స్వప్న, రామశంకర్ తదితరులు పాల్గొన్నారు.
