వ్యభిచారానికి ‘గోప్యత’ కవచం కాదు: సుప్రీంకోర్టు
- అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే - July 4, 2026
- ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్.. - July 4, 2026
- బద్రీనాథ్ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు - July 4, 2026

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును రక్షణ కవచంగా వినియోగించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు అవసరమైతే మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDRలు), హోటల్ బస వివరాలు తదితర సంబంధిత ఆధారాలను న్యాయస్థానం ముందు సమర్పించవచ్చని ధర్మాసనం తేల్చిచెప్పింది.
వ్యక్తిగత గోప్యత హక్కు రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కేనని, అయితే అది నిరపేక్షమైనది కాదని, ప్రజా ప్రయోజనం, న్యాయ విచారణ, సత్యాన్వేషణ వంటి అంశాల దృష్ట్యా చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వైవాహిక వివాదాల్లో వాస్తవాలను వెలికితీసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను గోప్యత హక్కు పేరుతో అడ్డుకోవడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది.
తమ తప్పిదాలను మరుగునపరచేందుకు గోప్యత హక్కును దుర్వినియోగం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు విడాకులు, వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాల స్వీకరణకు కీలక న్యాయ మార్గదర్శకంగా నిలవనుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
