9 మంది పోలీసులకు జీవిత ఖైదు

మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ప్రతి నిందితుడికి రూ.56 వేల జరిమానా కూడా విధిస్తూ, అందులో 70 శాతం మొత్తాన్ని బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

2011 మే 10న దొంగతనం అనుమానంతో ఎలాంటి నేరచరిత్ర లేని 23 ఏళ్ల బెగ్యా పవార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందాడు. పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంపై 44 తీవ్ర గాయాలు, పలు ఎముకలు విరిగినట్లు తేలడంతో పోలీసుల అమానుషత్వం వెలుగులోకి వచ్చింది. ప్రారంభంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత కుటుంబం, పార్ధి గిరిజన సంఘాలు న్యాయం కోసం పోరాడాయి. అనంతరం కేసు సీఐడీకి బదిలీ కాగా, దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా కోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు అనంతరం బాధితుడి తల్లిదండ్రులు 15 ఏళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని భావోద్వేగానికి గురయ్యారు.

You may also like...