కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరామ్’ నినాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు ‘జై శ్రీరామ్’ అన్నారని, అదే భావజాలాన్ని తన కేబినెట్ సభ్యులకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ భక్తి, హిందూ సంప్రదాయాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ‘జై శ్రీరామ్’ అంటే ప్రజలకు ఆధ్యాత్మిక బలం కలుగుతుందని, అలాంటి పవిత్ర నినాదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదన్నారు. దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తగదని విమర్శించారు. హైదరాబాద్ పాతబస్తీలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, కొండా సురేఖను పిలిపించి వివరణ కోరాలని, అవసరమైతే రాజీనామా చేయించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
