శంకర్‌పల్లి మండలంలో విపరీతంగా వ్యాపిస్తున్న అక్రమ వ్యాపారం

- హోటళ్లు–ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన
- డొమెస్టిక్ గ్యాస్ సరఫరా వెనుక ఎవరు?
- ప్రభుత్వానికి భారీ సబ్సిడీ నష్టం
- ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు
- కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రజల డిమాండ్
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:
శంకర్‌పల్లి మండలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్థానికంగా ఉన్న చిన్న-పెద్ద హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజు రోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్థానంలో, కొందరు హోటల్ నిర్వాహకులు నిర్బంధం లేకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదంగా మారుతోంది.
నిబంధనల ప్రకారం హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, క్యాటరింగ్ యూనిట్లు వంటి వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలి. అయినప్పటికీ శంకర్‌పల్లి మండలంలోని స్థానిక హోటళ్లలో ఎక్కువ ఖర్చు అవుతుందన్న కారణంతో డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరికి డొమెస్టిక్ గ్యాస్ సరఫరా ఎవరు చేస్తున్నారు? అన్న ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు ఎలా వాణిజ్య సంస్థల చేతికి చేరుతున్నాయన్నదానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డొమెస్టిక్ గ్యాస్‌ను వాణిజ్యంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి సబ్సిడీ రూపంలో భారీ ఆర్థిక నష్టం జరుగుతోంది. అంతేకాదు, ఈ సిలిండర్లు వాణిజ్య వినియోగానికి అనువుగా రూపొందించబడకపోవడంతో ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుంది. చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సరైన భద్రతా ప్రమాణాలు, వెంటిలేషన్ లేకుండా గ్యాస్ వాడటం వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లకు అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగితే హోటల్ సిబ్బంది, కస్టమర్లు మాత్రమే కాకుండా చుట్టుపక్కల నివాసితుల ప్రాణాలకు కూడా ముప్పు తప్పదు.
ఈ అక్రమ వ్యవహారం బహిరంగంగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తనిఖీలు జరిగినా, అవి కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీని వల్ల నిర్వాహకులు మరింత ధైర్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరా చేస్తున్న వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోటళ్లకు అక్రమంగా గ్యాస్ అందిస్తున్న డీలర్లు, మధ్యవర్తుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. శంకర్‌పల్లి మండలంలో ఉన్న అన్ని స్థానిక హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, కమర్షియల్ గ్యాస్ తప్పనిసరిగా వినియోగించేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అప్పుడే ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టి ప్రజల భద్రతను కాపాడటం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
