హిల్టప్ కుంభకోణం?

పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ దృష్టి ఎందుకు?
I. విలువ పెరిగిన భూములపై రాజకీయ పెద్దల కన్ను
సుమారు 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు అప్పట్లో విలువ కలిగిన ప్రాంతాలు కావు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు భూములు ఇచ్చింది. కాలక్రమంలో హైదరాబాద్ మహానగరం విస్తరించడంతో కీలకమైన ప్రైమ్ లొకేషన్లుగా మారాయి. అప్పట్లో ఏమాత్రం ధరకానివి ఇప్పుడు చదరపు గజానికి లక్షలు పలుకుతున్నాయి. ఈ భారీ విలువ పెరుగుదలే రాజకీయ పెద్దల దృష్టిని ఆకర్షించింది.
II. పరిశ్రమలు మూతపడిన తర్వాత ఖాళీగా ఉన్న వేల ఎకరాలు
టెక్నాలజీ మార్పు, మార్కెట్ పోటీ, పరిశ్రమల అనర్థకత కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. చాలా భూములు యాక్టివ్ యూజ్‌లో లేవు. ప్రభుత్వం గతంలో ఒఆర్ఆర్ వెలుపల కొత్త పారిశ్రామిక వాడలు ఇచ్చి పాత వాడలను బయటకు తరలించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో పాత వాడల్లో వేలాది ఎకరాలు ఖాళీగా మిగిలాయి. ఇప్పుడు ఈ ఖాళీ భూములపై ప్రభుత్వ దృష్టి పడడం పై వివాదం పెరిగింది.
III. ‘హిల్టప్’ విధానం—విధానం పేరా? లేక వసూళ్లకు కొత్త మార్గమా?
ప్రభుత్వం హిల్టప్ (Hyderabad Industrial Lands Transformation Policy) పేరుతో కొత్త విధానం తెచ్చింది. దీని ద్వారా పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్‌లుగా మార్చే అవకాశం కల్పిస్తోంది. కానీ పరిశ్రమలకు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు మార్చితే కేటాయింపు రద్దు అవుతుందన్న ప్రస్తుత నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వం మార్పిడికి దారి చూపుతుంది. రిజిస్ట్రేషన్ విలువలో 30% మాత్రమే తీసుకుని భారీ విలువ కలిగిన భూములపై పర్మనెంట్ హక్కుని కల్పించేందుకు సిద్ధమవడం తీవ్ర అనుమానాలకు దారి తీస్తోంది.
II. నామమాత్రపు ధరలతో భారీ లాభాలు—ఎవరికోసం?
1. రిజిస్ట్రేషన్ విలువ vs మార్కెట్ విలువ – అసలు లాభం ఎక్కడ?
పరిశ్రమలకు గతంలో 10 రూపాయలు గజానికి ఇచ్చిన భూమి ఇప్పుడే లక్షలు విలువ.
రిజిస్ట్రేషన్ విలువ మాత్రం 20–30 వేలే.
హిల్టప్ ప్రకారం కేవలం 6–9 వేల రూపాయలు చెల్లిస్తే భూమిని పూర్తిగా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు.
అంటే —
మార్కెట్ విలువ లక్ష… చెల్లించేది కేవలం కొన్ని వేలే!
ఇది ప్రభుత్వానికి కాదు, భూమిని పట్టుకున్న వ్యక్తులకు భారీ లాభం. ఈ లాభాలే హిల్టప్‌పై అనుమానాలు పెంచుతున్నాయి.
2. డెవలపర్ల అనుమానాలు—‘అనుమతుల మీదే అవినీతి రాజ్యం’
జీహెచ్‌ఎంసీ–హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే లేఔట్లు, అపార్ట్‌మెంట్లకు అనుమతుల కోసం భారీ అవినీతి జరుగుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ఫ్లాట్లు, డబ్బులు, పర్సంటేజీలు లేకుండా అనుమతి రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి సిస్టంలో పరిశ్రమల భూములకు కన్వర్షన్ ఎక్కడ అంత సులభం కాదని, “హిల్టప్ కూడా పెద్దమొత్తాల వసూళ్లకు కొత్త మార్గం మాత్రమే” అని డెవలపర్లు అనుమానిస్తున్నారు.
III. యాజమాన్య వివాదాలు—లీజు, సబ్ లీజు, సెటిల్‌మెంట్ ఆటలు
1. అసలు లీజుదారు ఒకరు – భూమిని పట్టుకున్న మరోకరు
దశాబ్దాల క్రితం లీజుకు తీసుకున్న భూమిని అనేక మంది సబ్‌లీజులకు ఇచ్చి తప్పుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో పేరు ఒకరి, కబ్జా మరొకరి. వీరి మధ్య న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా క్లియర్‌గా కాకున్న భూములు హిల్టప్ క్రింద మరింత సెటిల్‌మెంట్ డీల్స్‌కు దారి తీస్తాయనేది పెద్ద భయం.
2. ప్రైవేటు వ్యక్తుల ‘సెటిల్‌మెంట్ సిండికేట్’
ప్రభుత్వ ప్రతినిధులుగా నటించే కొందరు ప్రైవేటు వ్యక్తులు లీజుదారులు–సబ్‌లీజుదారులను పక్కకు తప్పించి మూడో వ్యక్తికి భూములు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదంతా జరిగితే వేల కోట్లు సెటిల్‌మెంట్ పేరుతో దోచుకునే అవకాశం ఉందన్న చర్చ బలపడుతోంది.
IV. 9,292 ఎకరాలకు మల్టీ యూజ్ జోన్—ఏం మారబోతోంది?
1. హైదరాబాద్‌లోని 22 పారిశ్రామిక వాడల జాబితా
నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, పటాన్‌చెరు, పాశమైలారం, మేడ్చల్, కుషాయిగూడ… ఇలా మొత్తం 22 పారిశ్రామిక వాడలు కలిపితే 9,292.53 ఎకరాలు ఉన్నాయి.
ఇవన్నీ మల్టీ యూజ్ జోన్‌లుగా మారితే వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తెర మీదికి వస్తుంది.
2. ప్రజా ప్రయోజనమా? లేక రియల్ ఎస్టేట్ లాభం కోసం?
ఈ భూములు నిజంగా పరిశ్రమల అభివృద్ధికి వినియోగించాలా?
లేక లక్షల కోట్ల విలువైన భూములను కొందరికి అప్పగించడానికే మార్పిడా?
ఇదే ఇప్పుడు పారిశ్రామిక వేత్తల నుండి ప్రతిపక్షాల వరకు అందరిలోనూ చర్చ.
