ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం

ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం
- కోట్ల రూపాయల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’తో గ్రామీణ అభివృద్ధికి భారీ ఊతం
- విద్య, మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- గురుకులాలు, రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో సమగ్ర అభివృద్ధి లక్ష్యం
- గిరిజన, మైనారిటీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పలు పనులకు శ్రీకారం
జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 6:
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అభివృద్ధి శంఖారావం మోగించారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, విద్యా విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారిస్తూ కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టమైంది.
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బోథ్ నియోజకవర్గంలోని అడేగామా గ్రామంలో ₹200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే తరహాలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కూడా ₹200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక సదుపాయాలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు.
టెక్నాలజీ అభివృద్ధికి ఊతమిస్తూ బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో ₹45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ₹20 కోట్లతో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల (బాలికలు) భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి మరియు సుందరీకరణ పనులకు ₹20.10 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ₹13.46 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు.
గిరిజన ప్రాంతాల పరిపాలనను బలోపేతం చేయడానికి ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో ₹15 కోట్లతో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా బోథ్ నియోజకవర్గంలో ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం వరకు ₹30 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్‌లో ₹20 కోట్లతో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ₹30 కోట్లతో 38 వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడం ద్వారా పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
విద్యుత్ రంగంలో బలోపేతం కోసం బోథ్ నియోజకవర్గంలోని ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ గ్రామాల్లో ₹8.99 కోట్లతో మూడు (33/11KV) విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పిప్రి ఎత్తిపోతల పథకానికి ₹50.70 కోట్లతో, తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి ₹44.64 కోట్లతో శంకుస్థాపనలు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ₹65.85 కోట్లతో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని లాండసాంగి పంప్ హౌస్ సమీపంలో ₹6.435 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో ₹31.52 కోట్లతో చిక్‌మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్‌కు ₹11.76 కోట్లతో మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, సాగునీటి వనరుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర ప్రగతిని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.


