ఆర్టీసీలో సమ్మె అలజడి…

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జేఏసీ నేతలు, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ వద్ద ఉండగా, దానికి ఆమోదం ఎందుకు తీసుకురావడం లేదని వారు ప్రశ్నించారు. కార్మికుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడవద్దని హెచ్చరించిన జేఏసీ నేతలు, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు.
వేతన సవరణ అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సరైన వేతన సవరణ లేకపోవడం అన్యాయమని నేతలు పేర్కొన్నారు. అంతేకాకుండా పాత బకాయిలుగా ఉన్న సుమారు రూ.2,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రతినెలా ఆర్టీసీకి రూ.350 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ పథకం వల్ల సంస్థ ఆదాయంపై ప్రభావం పడుతున్నందున ప్రభుత్వం పూర్తి సబ్సిడీని ఎలాంటి కోతలు లేకుండా చెల్లించాల్సిన బాధ్యత ఉందని వారు స్పష్టం చేశారు. నిధుల విడుదలలో నిర్లక్ష్యం కొనసాగితే ఆర్టీసీ మరింత ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుందని హెచ్చరించారు.
ట్రేడ్ యూనియన్లపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రజాస్వామ్య హక్కులను కుదించే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడ్డారు. కార్మిక సంఘాల హక్కులను అణగదొక్కే విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమ్మె నోటీసు ఇవ్వడానికి ముందు హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈవీ బస్సుల నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటం యాజమాన్యంతో కాదని, ప్రభుత్వంతోనే తమ యుద్ధమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ఓపికగా ఎదురుచూశామని, కానీ ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా లేకుండా పోయిందని వారు వాపోయారు. తమకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా వాటా కేటాయించాలని కోరుతూ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వంటి పథకాల్లో మార్పులు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయిందని జేఏసీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు చేయకపోతే ప్రజల ముందు ఎలా సమాధానం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ హక్కులను కాపాడేందుకు తాము చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే అసెంబ్లీ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా సాఫీగా ముందుకు సాగలేదని గుర్తు చేస్తూ, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
