కోహెడ భూములపై కుంభకోణం కుట్ర?

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :
రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ . హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, భూముల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన హరీశ్ రావు, నాదర్‌గుల్, కోహెడ ప్రాంతాల భూములపై కాంగ్రెస్ నాయకులు గద్దల్లా వాలిపోతున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల దోపిడీ లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతోందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోహెడలో 200 ఎకరాల భూమిని సేకరించి, ప్రపంచ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు న్యాయం చేస్తూ భూసేకరణ చేపట్టామని, జీవో 216 ప్రకారం రూ.350 కోట్ల నిధులను బ్యాంక్ ఖాతాలో ఉంచామని గుర్తు చేశారు. అలాగే జీవో నెంబర్ 11 ద్వారా కోహెడ మార్కెట్‌ను అధికారికంగా నోటిఫై చేసినట్లు వివరించారు.
అంతర్జాతీయ నిపుణులతో కలిసి సుమారు రూ.1000 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రణాళికను పక్కనబెట్టి భూముల విక్రయానికి సిద్ధమవుతోందని హరీశ్ రావు విమర్శించారు. లక్షలాది రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి దళారులకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
టీజీఐసీసీ ద్వారా కేరళకు చెందిన కార్పొరేట్ సంస్థలకు ఈ భూములను కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, రైతుల కంటే దళారులే ముఖ్యమా అని ప్రశ్నించారు. కోహెడలో నిర్మించాల్సిన ఫ్రూట్ మార్కెట్‌ను వేరే ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
దిల్ భూముల విషయంలో కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ, ఆ భూములపై ఇప్పటికే న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా వాటిపై హక్కులు చేస్తూ కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. హైకోర్టు థర్డ్ పార్టీ హస్తక్షేపాన్ని అనుమతించవద్దని స్పష్టం చేసినప్పటికీ, అక్కడే మార్కెట్ నిర్మాణం పేరుతో కొత్త పథకాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.
233 ఎకరాల దిల్ భూముల్లో ఇప్పటికే రహదారులు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల కోసం కొంతభాగం వినియోగంలో ఉందని, ఇంకా దళితులు సాగు చేస్తున్న భూములను పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు కూడా భారీ మొత్తంలో నిధులను మార్కెటింగ్ శాఖను కోరుతున్నారని వెల్లడించారు.
అదేవిధంగా కోహెడ సమీపంలోని రాందాసుపల్లి ప్రాంతంలో 1200 ఎకరాల భూములను ప్రోహిబిషన్‌లో పెట్టి సెటిల్‌మెంట్ దందాకు తెరలేపారని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. భూభారతి పేరుతో భూములపై నిషేధాలు కొనసాగిస్తూ, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే సెటిల్‌మెంట్లు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేసిన హరీశ్ రావు, కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం రైతులతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ అంశంలో చొరవ తీసుకుని మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో ఈ భూముల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోహెడ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

You may also like...

Translate »