బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం – ముగ్గురు హిందువులకు ప్రాతినిధ్యం

బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మిత్ర పక్షాలతో కలిసి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 209 సీట్లలో విజయం సాధించిన బీఎన్‌పీ, తారిఖ్ రహమాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన అంశం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

బీఎన్‌పీ మొత్తం ఆరుగురు మైనార్టీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించగా, అందులో నలుగురు విజయం సాధించారు. వారిలో ముగ్గురు హిందువులు ఉండటం విశేషం. దీంతో బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో హిందూ సమాజానికి ప్రాతినిధ్యం దక్కింది.

ఢాకా-3 నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు గయేశ్వర్ చంద్ర రాయ్ 99,163 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, జమాత్ పార్టీ అభ్యర్థి ఎండీ షాహినూర్ ఇస్లాం 83,264 ఓట్లతో పరాజయం చెందారు. గయేశ్వర్ చంద్ర రాయ్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

మగుర-2 నియోజకవర్గం నుంచి బీఎన్‌పీ వైస్ ఛైర్మన్ నితాయ్ రాయ్ చౌదురి 147,896 ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన జమాత్ పార్టీ అభ్యర్థి ముస్తాహిద్ బిల్లా 117,018 ఓట్లు పొందారు. అలాగే రంగమతి నియోజకవర్గం నుంచి అడ్వకేట్ దీపెన్ దేవాన్ 31,222 ఓట్లతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి పహేల్ చక్మా 21,544 ఓట్లకే పరిమితమయ్యారు.

ఇక జమాతే ఇస్లామీ పార్టీ తరఫున పోటీ చేసిన ఏకైక హిందూ అభ్యర్థి క్రిష్ణ నంది ఖుల్నా-1 నియోజకవర్గంలో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి 79 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తంగా ఈ ఫలితాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో మైనార్టీల ప్రాతినిధ్యంపై కొత్త దిశను సూచిస్తున్నాయి.

You may also like...

Translate »