ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం

జ్ఞానతెలంగాణ,ముంబై,అక్టోబర్ 29 : భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన రోహిత్, ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. అతని అద్భుత ఫార్మ్‌తో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, భారత కెప్టెన్ శుభమన్ గిల్‌లను ర్యాంకింగ్స్‌లో వెనక్కు నెట్టి ముందంజ వేశాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

781 రేటింగ్ పాయింట్లతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం 725 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. 38 ఏళ్ల రోహిత్ తన కెరీర్‌లో తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న రోహిత్, ఆ సిరీస్‌లో 101 సగటుతో 202 పరుగులు నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో, రోహిత్ అగ్రస్థానంలో నిలవడం భారత క్రికెట్‌కు శుభసూచకంగా భావిస్తున్నారు.

You may also like...

Translate »