డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం


డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం



🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం
🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు
🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం
🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు


జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో పాటు సామాజిక బాధ్యతను సమన్వయం చేసుకుంటూ పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు సాధించిన యువ పరిశోధకుడు బాన్సుడే రాహుల్ పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకోవడం అభినందనీయమని పలువురు విద్యావేత్తలు, సామాజికవేత్తలు కొనియాడారు. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో రాహుల్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ మాట్లాడుతూ, “తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో విద్యా, మీడియా పాత్ర” అనే సమకాలీన అంశంపై రాహుల్ చేపట్టిన పరిశోధన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, మీడియా, రాజకీయ అవగాహనపై ఈ పరిశోధన మరింత చర్చకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే విద్యను అభ్యసించి, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ డాక్టరేట్ సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కష్టపడే తత్వం, అంకితభావం, లక్ష్యసాధనపై నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాహుల్ నిరూపించారని తెలిపారు. ప్రస్తుతం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకునిగా సేవలందిస్తూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యాపరమైన సహాయ సహకారాలు అందించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనమన్నారు. యువత ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని సమాజ సేవలోనూ ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ యాక్ట్ డివిజన్ సభ్యుడు సోన్ కాంబ్లే సూరజ్, సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు జితేందర్, ఆదిలాబాద్ మండల అధ్యక్షుడు భూమన్న, సామాజిక కార్యకర్త శ్రీధర్ తదితరులు పాల్గొని బాన్సుడే రాహుల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like...