విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఎగ్జామ్ సామగ్రి పంపిణీ చేసిన గన్నేపాక నర్సింగరావు

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఎగ్జామ్ సామగ్రి పంపిణీ చేసిన గన్నేపాక నర్సింగరావు
జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :
విద్యే శక్తి, విద్యే సమాజ ప్రగతికి మూలాధారం అనే భావనతో కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల్ మాజీ ఉపాధ్యక్షుడు గన్నేపాక నర్సింగరావు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసి ఆదర్శప్రాయమైన సేవాభావాన్ని చాటుకున్నారు. చిన్నామంగళారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు, పెన్నులు వంటి అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గన్నేపాక నర్సింగరావు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా సమాజ మార్పుకు కూడా ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా పట్టుదలతో చదువుకుని తమ భవిష్యత్తును సుస్థిరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
విద్య ద్వారా మాత్రమే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి గౌరవం తీసుకురావాలని, భవిష్యత్తులో సమసమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థుల ప్రగతికి అవసరమైన ప్రోత్సాహం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గన్నేపాక నర్సింగరావు స్పష్టం చేశారు.
గ్రామ అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, యువత భవిష్యత్తు వంటి అంశాల్లో గన్నేపాక నర్సింగరావు చూపుతున్న చొరవ స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవాభావం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి లక్ష్మి బాలయ్య తనయుడు తలారి నరేష్, ఉప సర్పంచ్ అవిషిపేట ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు బట్టు మల్లేష్, కొంగళ్ళ విజయ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగులపల్లి రాములు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, విద్యా కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే గన్నేపాక ప్రవీణ్, ముట్టుపురి వెంకటేష్, గన్నేపాక ప్రసాద్, నాగులపల్లి హరిశంకర్, మొండి ఆనందం, మంగలి ప్రభు, నడిమింటి రత్నం, ఫయాస్ తదితరులు కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్యార్థుల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో చైతన్యాన్ని నింపింది.

