మహిళల రక్షణలో సామాజిక బాధ్యత కీలకం : రేవంత్ రెడ్డి

- మహిళా రక్షణలో పురుషుల బాధ్యత కీలకం
- వేధింపుల పట్ల నిర్లక్ష్యం నేరానికి ప్రోత్సాహం
- స్టాండ్ విత్ హర్ ఉద్యమానికి శ్రీకారం
- మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ ప్రాధాన్యం
- సైబర్ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
సమాజంలో మహిళల భద్రత కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల రక్షణలో మగవారు ముందుండి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. మహిళలపై ఎక్కడైనా వేధింపులు జరుగుతున్నప్పుడు చూసి మౌనంగా ఉండకుండా ధైర్యంగా నిలబడి ప్రశ్నించే సంస్కృతి యువతలో పెంపొందాలని సూచించారు. వేధింపులను చూసి కూడా స్పందించకుండా ఉండటం నేరాన్ని పరోక్షంగా ప్రోత్సహించడమేనని హెచ్చరించారు. సొంత కుటుంబ సభ్యులకు వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో, సమాజంలోని ఇతర మహిళల విషయంలోనూ అదే బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషుల బాధ్యతను గుర్తుచేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సమాజంలో మహిళలకు గౌరవం కలిగే వాతావరణాన్ని ఏర్పరచడంలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణకు పోలీసులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వ్యక్తి భాగస్వామిగా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే అందించడం వంటి చర్యలు మహిళల ఆర్థిక స్థితిని బలపరచడానికి చేపట్టినవేనని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు ఆర్టీసీ బస్సుల యాజమాన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారికి కొత్త ఉపాధి అవకాశాలు అందిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళలు సామాజికంగా మరియు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళల ఆర్థిక పురోగతితో తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమతుల్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఫిజికల్ నేరాల కంటే ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు మరియు సైబర్ వేధింపుల ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసినట్లు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఏదైనా ఘటన జరిగినప్పుడు మహిళలనే నిందించే చెడు సంప్రదాయాన్ని సమాజం పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధితురాలిని ప్రశ్నించే సంస్కృతి కంటే, ఆమెకు అండగా నిలబడే బాధ్యతను సమాజం స్వీకరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు మద్దతుగా నిలబడే భావనతో “స్టాండ్ విత్ హర్” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం కలిసే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

