ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ

ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ


తెలంగాణ వ్యవసాయ రంగాన్ని సాంకేతికత వైపు మలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు చూపుతోంది. సాగును ఆధునీకరించి, కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో వ్యవసాయ డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
పంటలకు పురుగుమందులు, సూక్ష్మ పోషకాలను సమర్థవంతంగా పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుంది. ఒక్కో డ్రోన్‌పై 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా రైతులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి దశలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్ల చొప్పున కేటాయించబడతాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వీటి వినియోగం నిర్వహించబడుతుంది.
డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70 నుంచి 80 శాతం వరకు తగ్గుతుందని మంత్రి వెల్లడించారు. కూలీల కొరత సమస్యకు ఇది సమర్థవంతమైన పరిష్కారమని, ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మందులు, ఎరువులు పంట అంతటా సమానంగా చేరడంతో దిగుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పసుపు ఉడకబెట్టే, పాలిషింగ్ యంత్రాలు, టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్ వంటి పరికరాలను కూడా అందించనున్నారు. ఇప్పటికే 9,936 యంత్రాలను పంపిణీ చేసి రూ.28.74 కోట్ల సబ్సిడీని రైతులకు నేరుగా జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

You may also like...

Translate »