చెవెళ్ల–శంకర్పల్లి రోడ్డుపై ట్యాంకర్ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని డ్రైవర్ను బయటకు తీశారు. డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తున్నట్లు తెలిసి, అతడికి పెద్దగా ప్రమాదం జరగలేదని ప్రాథమిక సమాచారం.
ట్యాంకర్లో ఉన్న ద్రవ పదార్థం రోడ్డుమీదికి కారిపోవడంతో వాహనదారులు భారీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలిసిన చెవెళ్ల పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడికావాల్సి ఉంది.
స్థానికుల ప్రకారం, ఇదే ప్రాంతంలో కేవలం 15 రోజుల క్రితం మరో లారీ ప్రమాదం సంభవించిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేదా జాగ్రత్త సూచనలు ఏర్పాటు చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు అధిక వేగంతో ప్రయాణించే ఈ మలుపు ప్రాంతం ప్రమాదకరంగా మారిందని, వరుసగా ప్రమాదాలు జరగడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.

