భారత విద్యార్థుల కలలకు ఎదురుదెబ్బ!

– వీసా కఠినతలతో నెరవేరని ఆశలు

– కుటుంబాల ఆందోళన పెరుగుదల

– హెచ్-1బీపై ట్రంప్ కఠిన తీరు – భవిష్యత్‌పై విద్యార్థుల్లో గుబులు

– వీసా రద్దుల వరద… ఎన్నో కలలు ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యం

– విదేశీ విద్యార్థుల తగ్గుదలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకూ గట్టి దెబ్బ


జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :

అమెరికాలో ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయ విద్యార్థులు ప్రయాణం మొదలుపెడతారు. అయితే గత కొన్నేళ్లుగా అక్కడి రాజకీయ వాతావరణం, వీసా పాలసీల మార్పులు, అంతర్జాతీయ విద్యార్థులపై పెరిగిన అనుమానాలు భారత విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాజా ఓపెన్ డోర్స్ నివేదిక ఈ ఆందోళనలను మరింత బలపరుస్తోంది. నివేదిక ప్రకారం, అమెరికాలో భారతీయ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు 10 శాతం మేర తగ్గాయి; అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం ప్రవేశాలలో 2025 ఫాల్ సెషన్‌లో 17 శాతం భారీ తగ్గుదల నమోదైంది. ఏకంగా 825 అమెరికన్ విశ్వవిద్యాలయాలపై నిర్వహించిన సర్వేలో 61 శాతం విద్యాసంస్థలు భారతీయ విద్యార్థుల నమోదులో స్పష్టమైన క్షీణతను గమనించాయని తెలుపుతున్నాయి. వీసా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం, తిరస్కరణల పెరుగుదల, వీసా ఇంటర్వ్యూ సమయాల లోపం, ప్రయాణ ఆంక్షలు ఇలా అనేక అంశాలు విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ పరిస్థితికి 96 శాతం యూనివర్సిటీలు వీసా సమస్యలనే ప్రధాన కారణంగా పేర్కొనడం, అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అయినప్పటికీ అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండటం భారత యువత ఉన్నత విద్యపై చూపుతున్న ఆసక్తికి నిదర్శనం. అయితే ఈ పెరుగుదల ప్రధానంగా అండర్‌గ్రాడ్యుయేట్, డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉండగా, నైపుణ్య ఆధారిత గ్రాడ్యుయేట్ అడ్మిషన్లలో మాత్రం తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోంది.

అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వీసా కఠినతపై చర్యలు విద్యార్థుల్లో ఆందోళనలు మరింత పెంచుతున్నాయి. హెచ్-1బీ దుర్వినియోగంపై 170కి పైగా విచారణలు ప్రారంభించడం, కొత్తగా హెచ్-1బీ దరఖాస్తులపై లక్ష డాలర్ల భారీ ఫీజు ప్రతిపాదనకు వైట్ హౌస్ మద్దతు తెలపడం వంటి నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులు, STEM విద్యార్థులకు పెద్ద సవాలుగా మారాయి. కొంతమంది రిపబ్లికన్ చట్టసభ సభ్యులు హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్న నేపధ్యంలో, అమెరికాలో చదివే విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి మరింత పెరిగింది. ఒకవైపు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు పొందే అవకాశం తగ్గిపోతుండగా, మరోవైపు స్టేట్ డిపార్ట్‌మెంట్ జనవరి నుంచి 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. వీసా రద్దులకు స్పష్టమైన కారణాలు వెల్లడించకపోవడం, ‘సెక్యూరిటీ రిస్క్’, ‘డాక్యుమెంటేషన్ ఇష్యూ’ వంటి అస్పష్టమైన కారణాలు మాత్రమే చూపించడం విద్యార్థుల్లో భయాన్ని మరింతగా పెంచుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులే ఏటా దాదాపు 55 బిలియన్ డాలర్లను అందిస్తూ, 3.55 లక్షల ఉద్యోగాలకు జీవనాడిగా నిలుస్తుండగా, ప్రభుత్వ చర్యలు ఈ ఆర్థిక ప్రవాహంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థుల తగ్గుదలతో యూనివర్సిటీల రీసెర్చ్ గ్రాంట్లు, ఫండింగ్, శ్రామిక వనరులు, విద్యా ప్రమాణాలపై కూడా ప్రభావం పడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా STEM కోర్సులు అంతర్జాతీయ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడుతుండగా, ఈ తగ్గుదలతో పరిశోధన స్థాయి, ఆవిష్కరణలు, టెక్నాలజీ పురోగతి కూడా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకుల హెచ్చరిక. ఈ మొత్తం పరిణామాల నడుమ అమెరికాలో చదువు కలలు కన్న భారతీయ విద్యార్థులు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పెరిగింది. భవిష్యత్తులో వీసా పాలసీలు మారుతాయా, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు కొనసాగుతాయా, లేదా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధానాలను పునఃసమీక్షిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం, అమెరికాలో ఉన్నత విద్య భారత విద్యార్థులకు మరింత సవాలుతో కూడిన ప్రయాణంగా మారుతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

You may also like...

Translate »