తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

  • ఔట్ సోర్సింగ్ విధానంలో టీజీటీఎస్ ద్వారా నియామక ప్రక్రియ
  • నెలకు రూ. 15,000 గౌరవ వేతనం.. పది నెలల పాటు చెల్లింపు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లను మళ్లీ సజీవంగా మార్చడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం.

విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించారు. ఈ పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీజీటీఎస్‌) ద్వారా నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఎంపికైన బోధకులకు నెలకు రూ.15,000 చొప్పున పది నెలలపాటు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వ్యయాన్ని సమగ్ర శిక్షా నిధుల ద్వారా భరించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఐదేళ్ల కాలపరిమితితో ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత వారిని తొలగించడంతో ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో అనేక కంప్యూటర్లు పాడై మూలలకు చేరాయి. ఇప్పుడు కొత్తగా నియమించబడే బోధకులు ల్యాబ్‌ల నిర్వహణతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న పలు డిజిటల్ విద్యా కార్యక్రమాల విజయానికి కూడా ఈ నియామకాలు దోహదం కానున్నాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1,354 పాఠశాలల్లో నడుస్తున్న అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ తరగతుల వంటి ప్రోగ్రాములను సమర్థవంతంగా నిర్వహించడానికి కంప్యూటర్లపై అవగాహన కలిగిన బోధకుల అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు కొత్త ఊపు వస్తుందని, నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లు తిరిగి చైతన్యవంతమవుతాయని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

You may also like...

Translate »