విఫలం అయిన “మేకిన్-ఇండియా స్కీమ్” : ఒక విశ్లేషణ.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్


భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చివేయాలనే ఆశతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన ‘మేక్ ఇండియా’ ప్రచారం, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, తన స్వంత గుర్తింపును కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ‘భారతం తయారీ శక్తిగా మారాలి’ అనే మహా మంత్రంగా ప్రవేశపెట్టారు. ఏటా 12-14 శాతం వృద్ధి, జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచడం, 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించడమే దీని ముఖ్య లక్ష్యాలు అని ఆయన తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. అయితే, 2025 సెప్టెంబర్ 27 నాటికి, ఈ లక్ష్యాలు కేవలం కాగితాలపై మాత్రమే మిగిలి ఉన్నాయి. తయారీ రంగం జీడీపీలో 13 శాతానికే పరిమితమైంది, వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.26 శాతం వరకు మాత్రమే చేరింది. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలు 1.5 కోట్లకు మించలేదు. ఇది కేవలం ఒక ప్రచార పధకం మాత్రమేనా, లేక ఆర్థిక విధానాల లోపాలకు సంకేతమా? ఈ విశ్లేషణ ద్వారా, మా దేశ తయారీ రంగం యొక్క నిజమైన చిత్రాన్ని పరిశీలించి చూద్దాం. ఇక్కడ వాగ్దానాలకు, వాస్తవాలకు మధ్య పొంతన లేని అంతరం (గ్యాప్) మాత్రమే కనిపిస్తుంది.

ప్రారంభ దశలో ‘మేక్ ఇండియా’ ఒక ఉత్సాహకరమైన కార్యక్రమంగా కనిపించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, మరియు భారత దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే ఆశయంతో ఇది రూపొందించబడింది. 2014-2019 మధ్య, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డీ.ఐ.) తయారీ రంగంలో 69 శాతం పెరిగి 165 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఒక సానుకూల సంకేతంగా కనిపించింది. ముఖ్యంగా చైనా-అమెరికా వాణిజ్య యుద్ధాలు భారత దేశానికి అవకాశాలు తెరిచిన సమయంలో అయితే, ఈ పెట్టుబడులు పెద్ద కంపెనీలకు మాత్రమే పరిమితమైనవి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో. చిన్న మరియు మధ్యస్థ సంస్థలు (ఎంఎస్ఎంఈఎస్),
ఇవి భారత తయారీ యొక్క వెన్నెముక. కానీ వీటిని పూర్తిగా వదిలివేయబడ్డాయి. 2024-25లో,35,000కి పైగా (ఎంఎస్ఎంఈఎస్) మూసివేయబడ్డాయి, గత సంవత్సరం కంటే రెట్టింపు. ఇది 3.17 లక్షల ఉద్యోగాల నష్టానికి దారితీసింది. మొత్తంగా, 2014-2025 మధ్య 7.5 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయి, ఇది ప్రభుత్వ ప్రోత్సాహకాల లోపానికి రుజువు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు; అవి లక్షలాది కుటుంబాల జీవితాల్లోకి చొచ్చుకు పోయిన నిజాలు. ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్‌లలో మెరుగుదల ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, నిజమైన సమస్యలు అధిక టాక్స్ భారం, ప్రభుత్వ నియంత్రణలు, అలాగే మూలాధార సదుపాయాల లోపం వంటి పద్ధతులు మారలేదు. ఫలితంగా, తయారీ రంగం జీడీపీలో 2010లో 17 శాతం నుండి 2023లో 13 శాతానికి పడిపోయింది. 2025లో కూడా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) మే, 2025లో 2.6 శాతం వృద్ధి మాత్రమే నిర్ధేశిత లక్ష్యాలకు దూరంగా చూపించింది.
.

ఉద్యోగాల కల్పన విషయాన్ని పరిశీలిస్తే, ‘మేక్ ఇండియా’ యొక్క ముఖ్య హామీ, మరింత విస్మయకరంగా మారింది. 100 మిలియన్ కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, 2004-2014 మధ్య కేవలం 6 శాతం వృద్ధి నుండి 2014-2025 మధ్య 15 శాతం వరకు మాత్రమే పెరిగింది. మొత్తం ఉద్యోగాలు 2013-14లో 30.3 మిలియన్ నుండి 2025లో 62 మిలియన్‌కు చేరాయి. ఇది కేవలం 32 మిలియన్ కొత్త ఉద్యోగాల లక్ష్యానికి కనీసం మూడవ భాగం కూడా కాదు. ముఖ్యంగా, 2016-2021 మధ్య, ఉద్యోగాలు సగానికి సగం తగ్గాయి. కోవిడ్ ప్రభావంతో కలిపి. 2025 ఆగస్టులో, దేశవ్యాప్త అన్‌ ఎంప్లాయ్‌మెంట్ రేటు 5.1 శాతానికి తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో 4.4 శాతం అలాగే నగరాల్లో 7.2 శాతం ఉంది. తయారీ రంగంలో, యువత అన్‌ఎంప్లాయ్‌మెంట్ మరింత తీవ్రంగా కనపడుతుంది. 2030 వరకు 7.9 మిలియన్ నాన్-ఫామ్ జాబ్స్ ప్రతి సంవత్సరం అవసరమని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే దానిని సాధించటం అంత తేలిగ్గా కనపడటం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన లోపం స్పష్టంగా కనిపిస్తుంది: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీ.ఎల్.ఐ.) స్కీమ్ వంటివి కొన్ని చర్యలు ఉన్నాయి. కానీ అవి పెద్ద పరిశ్రమలకు మాత్రమే ప్రయోజనకరం. చిన్న కంపెనీలకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్, క్రెడిట్ యాక్సెస్ వంటివి నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఫలితంగా, 22 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.అలాగే తయారీ రంగం వారికి ఆశలు,ప్రోత్సహాకాలు కల్పించ లేదు. ఇది కేవలం ఆర్థిక విఫలం మాత్రమే కాదు. సామాజిక అస్థిరతకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.

ఎగుమతుల విషయంలో కూడా, ‘మేక్ ఇండియా’ యొక్క పతనం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతంత్ర్య కాలంలో 2.2 శాతం గ్లోబల్ షేర్ నుండి, ప్రస్తుతం 1.6 శాతానికి పడిపోయింది. 2025లో, మెర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ 437.42 బిలియన్ డాలర్లకు చేరాయి. గత సంవత్సరం కంటే 0.35 బిలియన్ పెరిగాయి. ఏప్రిల్-ఆగస్టు 2025లో 184.13 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. 2.52 శాతం వృద్ధితో. ఇది ఒక చిన్న విజయం. కానీ, గ్లోబల్ ట్రేడ్ యుద్ధాలు, రూపాయి విలువ పతనం (2025లో చారిత్రక తక్కువ స్థాయికి) మధ్య, ఇది తగినంత కాదు. అమెరికా టారిఫ్‌లు పెరిగిన సమయంలో, భారత ఎక్స్‌పోర్ట్స్ 87 బిలియన్ డాలర్లకు కూడా బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం 2025లో 870 బిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకుంది. కానీ, ఇది గత రికార్డ్ 825 బిలియన్‌కు మించాలంటే, స్వదేశీ ప్రోత్సాహకాలు పెంచవలసిన అవసరం ఉంది. కానీ, ‘మేక్ ఇండియా’లో భాగంగా ఇచ్చిన ప్రోత్సాహకాలు కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఫ్యూల్ ఎక్స్‌పోర్ట్స్ 2025లో 610,000 బీపీడీకి చేరాయి. కానీ, మొత్తం ఎక్స్‌పోర్ట్స్ డిఫిసిట్ 27.35 బిలియన్ డాలర్లకు చేరింది. ఆర్థిక నిపుణులు చెప్పేది సరైనదే: ఎక్స్‌పోర్ట్స్ పెరిగితే, విదేశీ మారక నిల్వలు, దౌత్య బలం కూడా పెరుగుతాయి. కానీ, మోదీ పాలనలో భారత ప్రతిష్ట మరింత కిందకి దిగజారింది. ట్రంప్ టారిఫ్‌లు, హెచ్-1బీ వీసా ఫీజు పెంపులు వంటివి దానికి రుజువు. ఇప్పుడు మరోసారి ‘స్వదేశీ’ నినాదం పునఃప్రవేశం చేస్తున్నారు, కానీ 11 ఏళ్ల ముందు ప్రారంభించిన ఈ స్కీమ్‌ను ఎందుకు ప్రస్తుతం మరచారో ? విశ్లేషణ చేయటం లేదు. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఈ విఫలత్వానికి కారణాలు చాలా లోతుగా ఉన్నాయి. మొదట,ఈ పాలసీ లోఅస్థిరత, డెమోనిటైజేషన్, జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ వంటి నిర్ణయాలు మధ్యస్థ సంస్థలు (ఎంఎస్ఎంఈఎస్)ను కుంగదీసాయి. రెండవది, మూలాధార సదుపాయాల లోపం: విద్యుత్, రవాణా, నీరు వంటివి ఇంకా సమకూర్చ లేదు. మూడవది, గ్లోబల్ పోటీ: చైనా, వియత్నాం వంటి దేశాలు తమ తయారీ రంగాన్ని మరింత సమర్థవంతంగా నడుపుతున్నాయి. మన దేశంలో, పని అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ, స్కిల్డ్ లేబర్ లోపం ఎక్కువగా ఉంది, కార్మిక చట్టాలు (లేబర్ లాస్ ) వంటి సమస్యలతో పోరాడుతోంది. ప్రభుత్వం (పీ.ఎల్.ఐ.) స్కీమ్‌తో ‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రమోట్ చేస్తోంది. కానీ ఇది కేవలం 5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి సహాయపడుతుంది. కానీ, విస్తృత మార్పు తీసుకొచ్చేది కాదు. 2025 క్యూ-1లో, జీడీపీ 7.8 శాతం వృద్ధి చూపించింది. కానీ, ఇది సర్వీసెస్ రంగం (61.4 శాతం ఎక్కౌంట్) కారణంగా, తయారీ రంగం లో కాదు. ఇది మనకు ఒక హెచ్చరిక. తయారీ రంగాన్ని పట్టించుకోకపోతే, నిరుద్యోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతుంది.(ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి)

అంతిమంగా, ‘మేక్ ఇండియా’ను రక్షించాలంటే, ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా, అంతకు మించి చర్యలు తీసుకోవాలి.(ఎంఎస్ఎంఈఎస్) కు సబ్సిడీలు, స్కిల్ ట్రైనింగ్, మరియు ఎక్స్‌పోర్ట్ ప్రోత్సాహకాలు అందించే వెలసిన అవసరం ఉంది. గ్లోబల్ ట్రేడ్ అవకాశాలను (ఉదా., అమెరికా -చైనా టెన్షన్స్) ను మనం సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే, ఈ “మేక్ ఇన్ ఇండియా స్కీమ్” కాస్తా “జోక్ ఇన్ ఇండియా” గా మిగిలి పోతుంది.సరిగ్గా ఆర్థిక నిపుణుల సూచనలు, సలహాలను పాటిస్తే భారత యువత ఆశలను మరింత చిగురింప చేయవచ్చు. ముఖ్యంగా మన నేతలు ఆర్థిక పునరుద్ధరణకు తయారీ రంగం కీలకం అని గుర్తించాలి; దానిని వదలిపెట్టడం అంటే, మన భవిష్యత్తును వదలిపెట్టడమే అవుతుంది.

You may also like...

Translate »