దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమాలు

- (పెరియార్ జయంతి సెప్టెంబర్ 17/ఆత్మగౌరవ ఉద్యమానికి వందేళ్ల సందర్భంగా )
భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి గారు. గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఆయన జయంతి జరుపుకుంటారు. మరోవైపు ఈ ఏడాదికి ఆయన ప్రారంభించిన అత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు అవుతుంది. పెరియార్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట సామాజిక ఆధిపత్య ధోరణులు, చాందస భావాలపై ఆత్మగౌరవ రణభేరి గురించే. ఈ ఉద్యమం తమిళనాడు ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో పెను మార్పులకు సృష్టించింది. ప్రాంతీయ అస్తిత్వానికి ఊపిరిలుదింది. దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉద్యమానికి ఆజ్యం పోసింది. వెనకబడిన వర్గాలలో చైతన్యాన్ని రగిలించింది. ఈ సందర్భంగా వందేళ్ళ ఆత్మగౌరవ ఉద్యమ ప్రస్థానాన్ని సింహవలోకనం చేసుకోవాల్సిన సమయమిది. తమిళనాడులో 1925లో ఇ.వి. రామసామి ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించాడు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యం, సామాజిక అసమానతలను సవాలు చేశారు. దేవదాసి వ్యవస్థను వ్యతిరేకించారు. మహిళల హక్కులు, కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. మహిళల సాధికారతకు పెద్దపీట వేయడం జరిగింది. పూజారులు లేకుండా ఆత్మగౌరవ వివాహాలు జరుపుతూ చట్టపరమైన గుర్తింపు ఇచ్చారు. భారతదేశంలో మొదటిసారిగా చట్టబద్ధంగా గుర్తించబడిన వివాహాలు ఇవే. అట్టడుగు వర్గాలకు కులాల మధ్య సమానత్వం, గౌరవాన్ని ప్రోత్సహించారు. హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహిస్తూ, గుడ్డి ఆచారాలను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ దృక్పథానికి పెద్దపీట వేశాడు. ఆయన సంస్కరణవాద, తార్కిక ఆలోచనలను వ్యాప్తి చేయడానికి “కుడి అరసు” అనే తమిళ వారపత్రికను ప్రచురించారు.
ఆత్మగౌరవంతో అధికారం.
పెరియార్ సమానత్వాన్ని ప్రబోధించి, సామాజిక అసమానతలపై పోరాడిన జ్యోతిరావు ఫూలే, బి.ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో గాఢంగా ప్రభావితమయ్యాడు. 1919 నుండి 1925 వరకుకాంగ్రెస్ పార్టీలో ఉంటు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పెద్దలతో విభేదించి దేశ స్వాతంత్ర్యం కన్నా సాంఘిక సమానత్వమే ముఖ్యమని పోరాడారు. కేరళలో1924- 25 లో అంటరానితనానికి వ్యతిరేకంగా ఆలయ ప్రవేశ హక్కుల కోసం జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. కుల వ్యవస్థను ధ్వంసం చేయడం, లౌకికవాదాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా తమిళనాడులో పెద్ద సామాజిక మార్పులను తీసుకువచ్చింది. ఆత్మగౌరవ పోరాట వారసత్వం తమిళనాడులో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, విద్య మద్దతు వంటి ప్రగతిశీల సామాజిక విధానాలను పునాది పడ్డది. ఇప్పటికీ తమిళనాడు ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ జరుగుతుంది. ఆత్మగౌరవ నినాదంతో తమిళనాట రాజకీయ పార్టీలైన DMK, AIDMK వంటివి ద్రావిడ ఉద్యమం నుంచే పుట్టాయి. నేటికీ ఇవే అక్కడి రాజకీయాలను శాసిస్తూ ఆత్మగౌరానికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఆత్మగౌరవం అంటేనే రాజ్యాధికారం, స్వశక్తితో స్వరాజ్యాన్ని నిర్మించుకోవడం. నేటికి మెజార్టీ బీసీ,ఎస్సీ,ఎస్టీ అగ్రకుల రాజకీయ పార్టీల నీడలోనే బ్రతుకుతున్నారు. తమ విముక్తిని కోరుకొని ధర్మంలో జీవిస్తున్నారు. ఇదెలా ఆత్మ గౌరవం అవుతుంది?. మనువాద భావజాల అణచివేతపై ప్రతిఘటననే పెరియార్ పోరాటం. ఇప్పటికీ ఆ ఛాయలు సమాజంలో కనబడుతున్నాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే భారత రాజ్యాంగ ఆయుధాలతో స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే మెజార్టీ వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక ఆర్థిక, రాజకీయ సాధికారత సాధ్యమవుతుంది.
తగ్గించి చూపెడుతున్న పెరియర్ పోరాటం.
ఇటీవల బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ ఆంటోనీ కళాశాలలో “ఆత్మగౌరవ ఉద్యమం మరియు దాని వారసత్వం” పై సదస్సు జరిగింది. పెరియార్ E.V రామస్వామి స్థాపించిన ఆత్మగౌరవ ఉద్యమం వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించారు. భారతదేశంలో ఇలాంటి చర్చ జరగక పోవడం బాధాకరం. దేశంలో కుల చైతన్యం, కులగణన, రాజకీయ డిమాండ్, రిజర్వేషన్స్ పెంపుపై చర్చ జరుగుతుంది. కులాధిపత్య రాజకీయాల్లో వెనకబడిన వర్గాలు, మహిళలు అవకాశాలకు దూరమవుతున్నారు. చాందస భావాలు, గుడ్డి నమ్మకాలు ప్రబలుతున్నాయి. ప్రశ్నించే వారిపై దాడి జరుగుతుంది. కుల, మతపరమైన అస్తిత్వ రాజకీయాలు మళ్లీ తలెత్తిన సందర్భంలో పెరియర్ ఉద్యమం ప్రబోధించిన భావాలు తిరిగి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమ ప్రభావంతో లౌకిక భావాలు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ప్రశ్నించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అంశాలను ప్రాథమిక విధులలో అధికరణ 51A(H) లో పొందుపరిచారు. పెరియార్ స్పష్టంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించి అట్టడుగు వర్గాల విముక్తికి కృషి చేశాడు. కానీ భారతదేశ చరిత్రలో ఆయనను ఇప్పటికీ హిందీ వ్యతిరేక ఉద్యమకారుడిగా, ఉత్తరభారతాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా పరిమితం చేయడం శోచనీయం. బహుజన రాజ్యాధికారాన్ని రుచి చూపించిన కాన్సిరాం లాంటి గొప్ప వ్యక్తి పెరియార్ ను ఉత్తర భారతదేశంలో పరిచయం చేసి ఆత్మగౌరవాన్ని ప్రబోధించాడు. ఇది పెరియార్ అనుచరులు అర్థం చేసుకోలేకపోవడం బాధాకరం. మరోవైపు ఇటీవల తెలంగాణలో జరిగిన మార్వాడి ఉద్యమంలో కొందరు మేధావులు మార్వాడిలని వ్యతిరేకిస్తూ, వైశ్యులకు మద్దతు పలకారు. వర్ణ వ్యవస్థలో ఉత్తర భారతదేశంలో మార్వాడిలు, దక్షిణ భారతదేశంలో వైశ్యులే ఒకటే కదా! వీరి వ్యాపార దోపిడీలో వెనుకబడిన వర్గాలంతా బలైనవారే. ఇప్పటివరకు ఇలాంటి తప్పుడు ఉద్యమాలు, తర్కం లేని ఆలోచనలు, వక్రీకరించిన చరిత్రలతో బడుగు బలహీన వర్గాలు బలైనారు. కావున ఆ చీకటి పొరల నుంచి సమాజం బయటకు రావాలి. అప్పుడే పెరియార్ ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకున్నట్టు.

సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
7989579428.