రెండు మూడు సంవత్సరాలలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,ములుగు ప్రత్యేక ప్రతినిధి :
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం కొన్నాళ్లుగా అనవసర రాజకీయ రంగు పులుముకుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేసి ఉంటే ఈరోజు వివాదాలకు తావుండేదే కాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల పురోగతి, ఆర్థిక పరిస్థితులు, భూసేకరణ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గోదావరి జలాలపై జరుగుతున్న చర్చలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సాగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం నీటి అంశాన్ని వాడుకోవడం సరికాదని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయొచ్చుకాని, నీటి వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమమని హితవు పలికారు. జలవనరుల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు వ్యయభారం గణనీయంగా పెరిగిందని సీఎం వెల్లడించారు. ప్రారంభంలో సుమారు ఆరు వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం దాదాపు పదెనిమిది వేల కోట్ల రూపాయల అవసరానికి చేరుకుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే లక్షా పది వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం వల్ల మిగతా సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ పనులు తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొన్నాయని విమర్శించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాజెక్టులను సమీక్షించి, దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
మేడిగడ్డ కుంగిన ఘటన తర్వాత అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకపోయిందని సీఎం గుర్తుచేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో వరి దిగుబడి అత్యధికంగా వస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి తెలంగాణ ఏర్పాటుకు తర్వాతి దశ వరకు సాగునీటి రంగంలో ఏమి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. గత పాలకులు చేసిన తప్పులను ప్రజలు గ్రహించి ఎన్నికల తీర్పు ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో ఏమి జరిగిందో, ప్రస్తుత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని తెలిపారు.
విపక్షం సభకు వచ్చి గోదావరి జలాల అంశంపై నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. పదేళ్ల అనుభవం ఉన్నవారు సలహాలు ఇస్తే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని, ఓటు వేసిన ప్రజలను తప్పుపట్టడం లేదా వారిని బహిష్కరించినట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హితవు పలికారు. పలు ఎన్నికల్లో వచ్చిన తీర్పులను గమనించిన తర్వాతైనా రాజకీయ నాయకులు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించి, ఆర్థిక వనరులను సమీకరించే దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. పూర్తి కాలేని ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వంటి నిర్మాణాల్లో ఏర్పడిన సమస్యలను గాలికి వదిలేయబోమని సీఎం తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను వృథా చేయడం ప్రభుత్వం ధోరణి కాదని పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకు అవసరమైన మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని వెల్లడించారు. సాంకేతికంగా సాధ్యమైన పరిష్కారాలను అమలు చేసి, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన నిధులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. పరస్పర చర్చలు, చట్టపరమైన ప్రక్రియలు, కేంద్రంతో సమన్వయం ద్వారా శాశ్వత పరిష్కారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా దక్కేదేమీ కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలే తుది నిర్ణయాధికారులని, వారు వరుసగా వివిధ పార్టీలకు అవకాశాలు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూసి భవిష్యత్తులో కూడా ప్రజలు మరో అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి, పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర పురోగతికి దోహదం చేయడం తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
