రాష్ట్రంలో విద్యా రంగం పతనమవుతోంది : కేంద్ర మంత్రి బండి సంజయ్

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్.డెస్క్ :
తెలంగాణలో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విద్యాసంస్థలు మూసివేయడం ఇదే మొదటిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 2,500 విద్యాసంస్థలు మూతపడడం వల్ల వేలాది మంది విద్యార్థులు చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యం పాలవుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బందికి నెలలుగా జీతాలు బకాయిల్లో ఉన్నాయి. అయినా ప్రభుత్వం నిశ్చలంగా చూస్తోంది” అని ఆయన మండిపడ్డారు.
బండి సంజయ్ తెలిపారు, విద్యార్థులు సమస్యలతో రోడ్లపైకి వస్తున్నా, అధికార పార్టీ నేతలు రాజకీయ ప్రదర్శనలతో సమయం గడుపుతున్నారని విమర్శించారు. “బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రెండు ప్రభుత్వాల అజాగ్రత్తల వల్లే విద్యా వ్యవస్థ కూలిపోతోంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,500 కోట్లకు చేరాయి. కనీసం ఆ మొత్తంలో సగం అయినా విడుదల చేయాలని యాజమాన్యాలు వేడుకుంటున్నా, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు” అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యా వ్యవస్థ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాను కృషి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
